సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వి
Last Modified: మంగళవారం, 8 సెప్టెంబరు 2020 (14:41 IST)

తెలంగాణ వైతాళికులను నిర్లక్ష్యం చేసిన ఆంధ్ర పాలకులు: మంత్రి కేటీఆర్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యక్తుల జయంతి ఉత్సవాలను తగిన రీతిలో నిర్వహిస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కె.టి రామారావు అన్నారు. మాజీ ప్రధాని పి.వి నరసింహరావుతో సహా పలువురు తెలంగాణ ప్రముఖ వ్యక్తులను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు గౌరవించలేదని వారిని విస్మరించారని తెలిపారు.
 
భారత మాజీ ప్రధాని పి.వి శతజయంతి ఉత్సవాలు సందర్భంగా పీవికి భారతరత్న ఇవ్వాలని సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరిచారు. కేంద్ర ప్రభుత్వం పీవికి భారతరత్న ప్రకటించాలని ఆయన కోరారు. పీవి ఒక్కరే కాదు తెలంగాణకు చెందిన ఎంతోమంది వైతాళికులను మరిచిపోయారని, వారి ఉనికి మరుగునపడిందని తెలిపారు. వారిని గౌరవించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.
 
పీ.వి నరసింహరావు అద్భుతమైన వ్యక్తి అని తెలిపారు. భూ సంస్కరణలు మొదలు పెట్టిన పేదలకు తన భూమిని పంచిన మహానుభావుడు పీవీ అని కేటీఆర్ గుర్తుచేశారు. ఏ రంగంలో తనకు బాధ్యతలు అప్పజెప్పినా ఆ రంగంలో సంస్కరణలు చేపట్టి ప్రజలకు ఎంతో మేలు చేశారన్నారు. పివి అంతర్జాతీయస్థాయిలో తెలంగాణకు పురస్కారాలు తెచ్చిపెట్టిందన్నారు.
 
రాష్ట్ర ఏర్పాటు జరిగి 6 సంవత్సరాలు పూర్తయిందని, రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఈశ్వరీబాయి, భాగ్యరెడ్డి వర్మ, సురవరం ప్రతాపరెడ్డి, కొమరయ్య, పైడి జయరాజ్, చాకలి ఐలమ్మ వంటి ఎందరినో తెలంగాణ సాంస్కృతిక శాఖ గౌరవించుకుందన్నారు. వీరి స్పూర్తిని భవిష్యత్ తరాల్లో నింపాలని ఆయన తెలిపారు.