సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 17 డిశెంబరు 2020 (10:13 IST)

చెరువు గట్టు వద్ద మహిళపై అత్యాచార యత్నం, ప్రతిఘటించడంతో స్క్రూడ్రైవర్‌తో గుచ్చి...

తను ఎక్కిన ఆటో తనను గమ్య స్థానానికి చేర్చుతుందని భావించింది ఆమె. కానీ ఆటో డ్రైవర్ ఆమె వెళ్లాల్సిన ప్రాంతానికి కాకుండా ఓ చెరువు గట్టు వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో తన వద్ద వున్న స్క్రూడ్రైవరుతో పొడిచి, ఆపై బండరాయితో మోది హత్య చేసాడు.
 
వివరాల్లోకి వెళితే... డిశెంబరు 7వ తేదీన వనస్థలిపురం పహాడీషరీఫ్ ఠాణా పరిధిలోని జల్ పల్లి చెరువు వద్ద మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని హత్య కేసుగా నమోదు చేసారు.
 
ఐతే ఆమె మృతదేహం గుర్తుపట్టలేనంతగా వుండటంతో ఆవైపు ఎవరు వెళ్లారన్నది సీసీ కెమేరాల ద్వారా పరిశీలించారు. ఆటో అనుమానస్పదంగా అటువైపు వెళ్లడాన్ని గమనించారు. ఆటో నెంబర్ ఆధారంగా నిందితుడుని పట్టుకున్నారు. అతడు చెప్పిన వివరాల ప్రకారం ఆమె ఊహాచిత్రాన్ని గీయడంతో మృతురాలు చాంద్రాయణగుట్ట మహ్మద్ నగర్‌కు చెందిన ఫాతిమాగా గుర్తించారు.
 
ఆ రోజు ఆమె తన సోదరి ఇంటికి వెళ్లి రాత్రి పొద్దుపోయాక ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో బాబానగర్ నుంచి చాంద్రాయణగుట్ట వెళ్లేందుకు ఆటోని పిలిచింది. ఐతే అప్పటికే ఆటో డ్రైవర్ పూటుగా మద్యం సేవించి వున్నాడు. ఆమెను చాంద్రాయణగుట్ట వద్ద దించకుండా నేరుగా జల్ పల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పెద్దచెరువు సమీపంలో పొదల చాటున ఆటో ఆపి ఆమెపై అత్యాచారం చేయబోయాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో స్క్రూడ్రైవరుతో తలపై గుచ్చి ఆపై బండరాయితో మోది హత్య చేసి పరారయ్యాడు.