బోయిన్‌పల్లిలో జరిగిన కిడ్నాప్ కేసుకు ప్రధాన సూత్రధారి అఖిల ప్రియనే అని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరు సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ఈ కిడ్నాప్ కేసుకు ఆమె పథకం వేశారని చెప్పుకొచ్చారు. పైగా, ఈ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేసినట్టు చెప్పారు.
ఈ కేసు గురించి ఆయన స్పందిస్తూ, ఈ కేసులో భూమా అఖిలప్రియే సూత్రధారి అని తేల్చేశారు. ఇప్పటివరకు అఖిలప్రియ, ఆమె పర్సనల్ అసిస్టెంట్ బోయ సంపత్ కుమార్, మల్లికార్జున్ రెడ్డి, డ్రైవర్ బాలా చెన్నయ్యను అరెస్టు చేసినట్టు చెప్పారు. వీరి నుంచి మూడు మొబైల్ ఫోన్లు, ఫేక్ నంబర్ ప్లేట్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
మల్లికార్జున్ రెడ్డి ద్వారా అఖిలూప్రియ 6 సిమ్ కార్డులను కొనుగోలు చేశారన్నారు. మియాపూర్‌లోని సెల్‌ఫోన్ షాపులో ఈ సిమ్ కార్డులను కొనుగోలు చేశారని వివరించారు. మల్లికార్జున్, శ్రీను పేర్ల మీద వీటిని ఈనెల 2న తీసుకున్నారని తెలిపారు. వీటిలో ఒక సిమ్‌ను అఖిలప్రియ వాడగా, మరికొన్ని సిమ్‌లను శ్రీను ఉపయోగించాడని చెప్పారు. 6 సిమ్ కార్డుల లొకేషన్లు, టవర్లను గుర్తించామని తెలిపారు.
కూకట్ పల్లిలోని లోధా అపార్టుమెంట్‌లో అఖిలప్రియ నివాసం ఉన్నట్టు గుర్తించామన్నారు. కిడ్నాప్‌కు రెక్కీ కూడా అఖిలప్రియ ఆధ్వర్యంలోనే జరిగిందన్నారు. లోధా అపార్టుమెంట్ నుంచే దీనికి సంబంధించిన ప్లానింగ్ జరిగిందన్నారు. కిడ్నాప్ కోసం ఒక స్కార్పియో, ఒక ఇన్నోవా, ఒక టూవీలర్‌ను ఉపయోగించారన్నారు. అఖిలప్రియ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌కు భార్గవ్ రామ్ కూడా సహకరించారని చెప్పారు.
మరవైపు, ఈ కిడ్నాప్ కేసులో అఖిలప్రియ ఏ1గా దొరకడానికి కారణం ఒక ఫోన్‌కాల్ అన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అప్పటివరకు అఖిలప్రియ అనుమానితుల్లో ఒకరుగా మాత్రమే వున్నారు.
ఈ కేసులో నిందితులు హై ప్రొఫైల్ వ్యక్తులు కావడంతో పోలీసు అధికారులు పక్కా ఆధారాల కోసం వెతికారు. అదేసమయంలో, పోలీసులకు ఒక క్లూ లభించింది. అదే అఖిలప్రియను ఏ1గా మార్చిందని పోలీసు అధికారులు అంటున్నారు. మొత్తం 19 మందిని నిందితులుగా చేర్చారు. ఈ కిడ్నాప్ చేసే ముందు పట్టుబడిన నిందితులు ఆరు సిమ్ కార్డులను తమ ఆధార్ కార్డు, వేలిముద్రలు, ఫోటోలు ఇచ్చి కొనుగోలు చేశారు.
ఇక కిడ్నాప్ జరిగిన రోజు రాత్రి, మీడియాలో విస్తృతంగా వార్తలు రావడం, ఆపై పోలీసుల సోదాలు ముమ్మరం కావడంతో నిందితులను విడిచి పెట్టాలని నిర్ణయించుకున్న కిడ్నాపర్లు, నార్త్ జోన్ డీసీపీకి అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఫోన్ చేశారు. వారు ప్రవీణ్ సోదరుడు సునీల్ తో డీసీపీని కలిపి మాట్లాడించారు. అంతకుముందు అదే ఫోన్ నుంచి కిడ్నాపర్లు అఖిలప్రియకు కాల్ చేశారు. అదే పోలీసులకు పెద్ద క్లూను అందించింది.
ఆ ఫోన్ నంబర్ అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ వద్ద పీఏగా పనిచేస్తున్న గుంతకల్లుకు చెందిన మల్లికార్జున్ దిగా గుర్తించారు. దీంతో అతనిని అరెస్ట్ చేశారు. అదే ఫోన్ నుంచి కడప జిల్లాకు చెందిన డ్రైవర్ బాల చెన్నయ్యకు, ఆళ్లగడ్డకు చెందిన సంపత్ కు ఫోన్లు వెళ్లడంతో వారినీ అదుపులోకి తీసుకున్నారు. మొత్తం కిడ్నాప్ వ్యవహారమంతా అఖిలప్రియ ఆధ్వర్యంలో జరిగిందని నిందితులను విచారించి తెలుసుకున్న పోలీసులు, ఆ మేరకు కోర్టుకు విన్నవించారు.