ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 10 జులై 2021 (13:05 IST)

తెలంగాణలో మరోసారి జ్వర సర్వే : సీఎం కేసీఆర్ సమీక్ష

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయితే, మూడో దశ కరోనా ప్రభావం ముప్పు పొంచి ఉందని నిపుణుల హెచ్చరికలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం నుంచి కరోనా మహమ్మారిని పూర్తిగా తరిమేసేందుకు మరోసారి జ్వరసర్వే నిర్వహించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. 
 
గతంలో నిర్వహించిన జ్వరసర్వేతో వైరస్‌ను ముందుగానే కట్టడి చేయగలిగామని, ఇప్పటికీ వైరస్‌ ప్రభావం ఉన్న కొద్దిపాటి ప్రాంతాల్లో మరోసారి సర్వే నిర్వహించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ, వైద్యారోగ్య పరిస్థితులపై ప్రగతిభవన్‌లో శుక్రవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తికి ఇప్పటికీ సరైన కారణాలను ఎవరూ గుర్తించలేకపోతున్నారని సీఎం కేసీఆర్‌ అన్నారు. కరోనా అంతుచిక్కని సమస్యగా మారిందని, దాన్ని కట్టడి చేయటంపై ప్రభుత్వాలకు సంపూర్ణ అవగాహన కరువైందని పేర్కొన్నారు. 
 
మన సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా ఇంకా పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాలేదని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో కరోనా ప్రమాదం పొంచే ఉన్నదని తెలిపారు. అలాంటి ప్రాంతాలను గుర్తించి శాస్త్రీయ అధ్యయనం చేసి, కరోనా విస్తరణకు గల కారణాలను లోతుగా పరిశీలించాలని సూచించారు. 
 
ఇందుకోసం వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం ఈ నెల 11, 12, 13 తేదీల్లో కరోనా ప్రభావిత సరిహద్దు జిల్లాల్లో పర్యటించాలని ఆదేశించారు.