గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (20:29 IST)

నెత్తిమీద రుమాలు కట్టి వేషం వేసి డైలాగులు చెప్తే సరిపోతుందా : సీఎం కేసీఆర్

kcrao
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ మరోమారు విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇందుకోసం ఆయన మూడు రంగులతో కూడిన కండుపాను తలపాగాగా చుట్టుకున్నారు. దీనిపై సీఎం కేసీఆర్ విమర్శించారు. "తలకు రుమాలు కట్టి వేషం వేసి డైలాగులు చెప్పడం తప్ప దేశానికి ఒక్క మంచి మాట చెప్పారా? అంటూ ప్రశ్నించారు. అందుకే చెప్తున్నా.. అందరం చైతన్యవంతులం కావాలి. రాష్ట్రంలో మనం ఎంత బాగున్నా కేంద్రంలో ప్రభుత్వం సరిగా లేకపోతే అభివృద్ధి అంతగా జరగదన్నారు. అందువల్ల కేంద్రంలో కూడా మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నా అని అన్నారు. 
 
సీఎం కేసీఆర్ మంగళవారం వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారంలో ఉన్నా కూడా మోడీ ఇంతకాలం ఏం చెయ్యలేదు. మిగతా రెండేళ్ల కోసమైనా ఏమైనా చెప్తారని నేను కూడా ప్రధాని మోడీ పంద్రాగస్టు ప్రసంగం విన్నా. దేశానికి ఉపయోగపడే ఒక్క మాటైనా చెప్పారా? అంటూ ప్రశ్నించారు. 
 
పైగా, దేశ పరిస్థితి దిగజారుతోంది. నిరుద్యోగం పెరుగుతోంది. రూపాయి విలువ పడిపోతోంది. కాబట్టి ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి, మంచి ప్రభుత్వాన్ని తీసుకురావడంలో మనందరం భాగస్వాములం కావాలని పిలుపునిచ్చారు. 
 
ప్రధాన మంత్రి ఇప్పటివరకు చెప్పిన ఒక్క వాగ్ధానం కూడా నిలబెట్టుకోలేదు. రూ.15 లక్షల ఇస్తానన్నారు. కనీసం పదిహేను పైసలు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. వికారాబాద్ ప్రజలంతా కలిసి ఈ దుష్టశక్తులకు తగిన బుద్ధి చెప్పాలి. భవిష్యత్తులో ఉజ్వల భారతం దిశగా అందరం కంకణ బద్దులు కావాలని ఆయన పిలుపునిచ్చారు.