శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (15:08 IST)

మాజీ మంత్రి మృతిపై సీఎం కేసీఆర్, కేటీఆర్ సంతాపం

మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్‌గా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చందూలాల్, ములుగు శాసనసభా స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు వరంగల్ ఎంపీగా గెలుపొందారని, రెండుసార్లు మంత్రి పదవి చేపట్టి, గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. 
 
నూతన తెలంగాణ రాష్ట్రంలో తన కేబినెట్‌లో గిరిజన సంక్షేమం, సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో రాష్ట్రానికి చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. మాజీ మంత్రి చందూలాల్ మరణం తీరనిలోటని అన్నారు. చందూలాల్ కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
 
అలాగే, మాజీ మంత్రి చందూలాల్ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే.తారక రామారావు. చందూలాల్ మరణం పార్టీకి తీరని లోటని కేటీఆర్ అన్నారు. రాజకీయాల్లో అనేక హోదాల్లో సుదీర్ఘకాలంపాటు ప్రజలకు, ముఖ్యంగా గిరిజనుల అభివృద్ధి కోసం అపూర్వమైన సేవలందించారని చందూలాల్ గారి సేవలని కొనియాడారు. చందూలాల్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించిన మంత్రి కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.