శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 జూన్ 2020 (14:48 IST)

గాంధీ ఆస్పత్రిలో శవాలు ఎటు పోతున్నాయి?

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్‌సోకి ప్రాణాలు కోల్పోయిన రోగి మృతదేహం మాయమైంది. సాధారణంగా ఈ వైరస్ సోకి చనిపోతే మృతదేహాన్ని కూడా ప్రభుత్వం అప్పగించదు. అలాంటిది.. ఇపుడు ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయిన రోగి మృతదేహాన్ని ఎలా మాయం కావడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
 
గత కొన్ని రోజులకు క్రితం ఆసిఫ్‌నగర్‌కు చెందిన రషీద్ అలీఖాన్ ఈనెల 9న కరోనా వ్యాధితో ఆస్పత్రిలో చేరాడు. 10న ఉదయం 4 గంటలకు రషీద్ మృతి చెందాడు. రషీద్ మృతి విషయాన్ని బుధవారం ఉదయం బంధువులకు అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో అతడి మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన బంధువులకు డెడ్‌బాడీ కనిపించలేదు. 
 
అయితే మృతదేహం కోసం బుధవారం సాయంత్రం బంధువులు ఆస్పత్రికి రాగా మార్చురీలో మృతదేహం కనిపించకుండా పోయింది. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే మృతదేహం మాయంపై ఆస్పత్రి వర్గాలు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మృతదేహం మిస్సవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డెడ్‌బాడీ కనిపించకుండా పోయిన ఘటన గాంధీ ఆస్పత్రి వద్ద కొంత ఆందోళనకు దారి తీసింది. 
 
మరోవైపు, గాంధీ ఆసుపత్రిలో ఓ రోగి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ అతడి బంధువు జూనియర్ డాక్టర్లపై దాడికి దిగారు. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఆ ఆసుపత్రి ఫర్నిచర్‌ను కూడా అతను ధ్వంసం చేయడంతో వైద్యులు నిరసనకు దిగారు. దీనిపై తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు.
 
'డాక్టర్లపై దాడులు దురదృష్టకరం. వీటిని తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారికి కఠిన శిక్ష పడేలా చూస్తాం. జూనియర్ డాక్టర్ల సమస్యలన్నీ పరిష్కరిస్తాం. ఆందోళన విరమించి విధుల్లో చేరుతున్నందుకు ధన్యవాదాలు' అని ఆయన చెప్పారు. 
 
కాగా, తమకు భద్రత కల్పించాలంటూ వైద్యులు చేస్తోన్న ఆందోళనల నేపథ్యంలో గాంధీ మెడికల్ కాలేజ్‌లో వైద్యులతో మంత్రి ఈటల సమావేశమయ్యారు. దీంతో వారు తిరిగి విధుల్లో చేరతామని చెప్పడం జరిగింది.