1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 ఆగస్టు 2021 (16:59 IST)

దళితబంధు నిధులు విడుదల.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం

సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని తన దత్తత గ్రామం వాసాలమర్రికి దళితబంధు నిధులు విడుదల చేశారు. దళితబంధు అమలుపై ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు ఈ పథకం అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున వాసాలమర్రివాసులకు దళితబంధు పథకం తొలి ప్రయోజనం అందనుంది. 
 
మొత్తం గ్రామంలో 76 దళిత కుటుంబాలు ఉండగా వారికి రూ.7.60 కోట్లు విడుదల చేశారు. దీనికి సంబంధించి ఎస్సీ అభివృద్ధి శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో వాసాల మర్రి గ్రామంలో పండగ మొదలైంది. 
 
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. దీంతో వాసాలమర్రిలో బతుకమ్మ పండుగ ముందే వచ్చింది. మహిళలు బతుకమ్మ ఆడుతూ అందులోనే మునిగి తేలుతున్నారు. ఇచ్చిన మాట సీఎం నిలబెట్టుకున్నందుకు కేసీఆర్ కు గ్రామస్తులు కృతజ్ణతలు తెలియజేశారు.