సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : గురువారం, 11 నవంబరు 2021 (11:56 IST)

ఢిల్లీలో ధర్నా చేయండి... బీజేపీకి మంత్రి గంగుల సలహా

ధాన్యం కొనుగోలుకు సంబంధించి కరీంనగర్‌లో పార్టీ నేతలతో మంత్రి గంగుల కమలాకర్‌ మీడియాతో మాట్లాడారు. రైతుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం ఆడుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ధాన్యం కొంటదా.. కొనదా? కేంద్రం స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.

రైతులు పండించే వానాకాలం పంట ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా 6,663 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివకే 5.15 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొన్నామని వెల్లడించారు.

రాష్ట్రం ప్రభుత్వం ఓవైపు ధాన్యం కొంటుంటే.. బీజేపీ నేతలు ధర్నాల పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు రాష్ట్రంలో కాకుండా ఢిల్లీలో ధర్నా చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలన్నారు.

ఆ పార్టీ నేతలు అబద్ధాలు చెప్పి బతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నేతల మాటలను తెలంగాణ రైతులు నమ్మొద్దన్నారు. వడ్లు తాము కొంటున్నామని, బియ్యం కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. యాసంగి పంట మొత్తం కేంద్రమే కొనాలని డిమాండ్‌ చేశారు.