శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 5 నవంబరు 2021 (19:27 IST)

యాదాద్రిలో పుష్పాలంకరణ సేవ దర్శనం

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామివారి భక్తులకు ఆలయ అధికారులు కొత్తగా మరో సేవ దర్శనం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం స్వామి వారి పుష్పాలంకరణ సేవ దర్శనం కల్పిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం 5.30 నుంచి 6 గంటల వరకు స్వామివారి పుష్పాలంకరణ దర్శనం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ అలంకార సేవలో పాల్గొనాలనుకునేవారు రూ.300 టికెట్‌ తీసుకోవాలని చెప్పారు.
 
నారసింహుని పుష్పాలంకరణ సేవను శుక్రవారం ఉదయం ప్రారంభించారు. మొదటి రోజు ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారి, పర్యవేక్షకులు, సిబ్బంది, స్థానికులు, భక్తులతో కలిపి మొత్తం 19 టికెట్లను విక్రయించారు.
 
ఘనంగా స్వాతి నక్షత్ర పూజలు. 
స్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో 108 కలశాలకు పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. కలశాల్లోని వివిధ ఫల రసాలు, పంచామృతాలు, శుద్ధ జలంతో స్వామి అమ్మవార్లను అభిషేకించారు. ఈ వేడుకల్లో ఆలయ ప్రధాన ఆచార్యులు, వేద పండితులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.