శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 16 ఆగస్టు 2020 (18:36 IST)

ఒకవైపు భారీ వర్షాలు... ఎగువనుంచి భారీ వరద.. ఉగ్రరూపందాల్చిన గోదారమ్మ

తెలంగాణ రాష్ట్రంలో కుంభవృష్టి కురుస్తోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల దెబ్బకు ఆ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు అతలాకుతలమైపోతున్నాయి. దీనికితోడు ఎగువు నుంచి భారీ మొత్తంలో వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గోదావరి నుంది ఉగ్ర గోదారై ప్రవహిస్తోంది. 
 
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రమాదకర స్థాయికి సమీపానికి చేరుకుంది. కేంద్ర జలమండలి (సీడబ్ల్యూసీ) అధికారులు గోదావరిలో నీటిమట్టం అంతకంతకు పెరుగుతుండడం పట్ల హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం రాత్రికల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుతుందని తెలిపారు.
 
దీంతో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు భద్రాచలం వద్ద ఇప్పటికే రెండోసారి వరద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలంలో ఆదివారం ఉదయానికి 48.1 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం మధ్యాహ్నానికి 52 అడుగులకు చేరింది. నీటిమట్టం 53 అడుగులకు చేరితే మూడో వరద హెచ్చరిక జారీ చేస్తారు. కేంద్ర జలమండలి వద్ద ఉన్న రికార్డుల ప్రకారం 1986లో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 56.6 అడుగులకు చేరింది.
 
ఆ రెండు జిల్లాల్లో కుంభవృష్టి 
ఇకపోతే, ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రోజుల తరబడి ఆగకుండా కురుస్తున్న వర్షం కారణంగా పంట పొలాలు నీటమునిగాయి. వరినాట్లు మునిగిపోయాయి. పత్తి, కంది, మొక్క జొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట పొలాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ఈ రెండు జిల్లాల్లో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది.
 
చెరువులు నిండి అలుగుపోస్తున్నాయి. చెరువులకు గండ్ల భయంతో చాలా ప్రాంతాల్లో స్థానికులు మత్తళ్లను తవ్వేశారు. లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. భారీ వర్షాల కారణంగా చాలా గ్రామాలకు ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
 
మరోవైపు, భారీ వర్షాలు పడుతుండడంతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో రికార్డు స్థాయికి నీటిమట్టం చేరుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా హెచ్చరికలు జారీ అయ్యాయి. రాష్ట్రస్థాయిలో వరద పరిస్థితిని పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 040-23450624 నెంబర్‌కు ఫోన్ చేసి వరద పరిస్థితులపై సమాచారం తెలుసుకోవచ్చు.
 
అంతకంతకూ పెరుగుతున్న నీటిమట్టం 
ఎగువన కర్ణాటక రాష్ట్రంతో పాటు, కృష్ణా పరీవాహక ప్రాంతమైన నల్లమల అడవులు, ఉమ్మడి మహబూబ్ నగర్, కర్నూలు, జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి నదిలో భారీ వరద పారుతోంది. ఆల్మట్టి మినహా మిగతా జలాశయాలన్నీ ఇప్పటికే నిండిపోగా, శ్రీశైలానికి పెద్ద ఎత్తున వరద వస్తోంది. మొత్తం 885 అడుగుల నీటిమట్టం సామర్థ్యమున్న జలాశయంలో ప్రస్తుతం 870 అడుగుల నీటిమట్టం ఉంది. 
 
రిజర్వాయర్ లో 141 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉందని, 1.22 లక్షలకు పైగా ఇన్ ఫ్లో వస్తుండగా, జల విద్యుత్ కేంద్రాల ద్వారా 43,048 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ నీరు నాగార్జున సాగర్ జలాశయానికి పోటెత్తుతోంది.
 
కాగా, నల్గొండ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ వద్దకు భారీగా వరద నీరు చేరుకోవడంతో, అధికారులు 70 గేట్లనూ ఎత్తివేశారు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద 1.10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, 91 వేలను నది ద్వారా సముద్రంలోకి, మిగతా నీటిని కాలువల ద్వారా కృష్ణా, గుంటూరు జిల్లాల వ్యవసాయ పనుల నిమిత్తం వదులుతున్నారు. 
 
మున్నేరుతో పాటు కట్టలేరు, వైరాల ద్వారా ప్రకాశం బ్యారేజీకి వరద నీరు వస్తోందని అధికారులు వెల్లడించారు. మున్నేరు నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలకు రాకపోకలు తెగిపోయాయి.