గురువారం, 21 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : గురువారం, 29 అక్టోబరు 2015 (12:21 IST)

కేసీఆర్ చండీయాగం ఎందుకు చేస్తున్నారు.. సీబీఐ కేసుల నుంచి..?: గుత్తా

తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చండీయాగాన్ని ఎందుకోసం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, నల్లగొండ లోక్ సభ సభ్యుడు గుత్తా సుఖేందర్ ప్రశ్నించారు. కేసీఆర్ చేస్తున్న చండీయాగంపై గుత్తా ఘాటు వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 23వ తేదీన తలపెట్టిన చండీయాగానికి హాజరుకావాలని ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌లతో పాటు పెద్ద సంఖ్యలో ప్రముఖులకు ఆహ్వానం పలికిన సంగతి తెలిసిందే.
 
ఈ నేపథ్యంలో నల్లగొండలో గుత్తా మీడియాతో మాట్లాడుతూ.. ఆరోగ్యం మెరుగుపడేందుకే కేసీఆర్ ఈ యాగం చేస్తున్నారా? లేక సీబీఐ కేసుల నుంచి విముక్తి కలగాలని యాగం చేస్తున్నారా? అంటూ ప్రశ్నాస్త్రాలు సంధించారు.
 
కాగా.. కరవుతో పాటు పలు సమస్యలతో బాధపడుతున్న తెలంగాణ సుఖంగా ఉండాలన్న ఆకాంక్షతో కేసీఆర్ ఈ బృహత్తర యజ్ఞాన్ని తలపెట్టినట్టు టీఆర్‌ఎస్ నాయకులు అంటున్నారు. దేశం నలుమూలల నుంచి చండీయాగం చేయగల 1100 మంది వేదపండితులు, వివిధ పీఠాల అధిపతులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. కేసీఆర్ ఫాంహౌస్ సమీపంలో యజ్ఞ వేదిక ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
 
యజ్ఞ సమయంలో అగ్ని కోసం 10 టన్నుల మోదుగ పుల్లలు సిద్ధం చేస్తున్నారు. యాగం జరిగినన్ని రోజులూ నిత్యమూ 10 క్వింటాళ్ల నెయ్యి అవసరం కానుంది. చిన్న జీయర్ స్వామి నేతృత్వంలో జరిగే వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరు కావచ్చని సమాచారం.