గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (12:08 IST)

లంచగొండి ఎస్ఐకు రెండేళ్ల జైలుశిక్ష.. ఎక్కడ?

jail
చట్టాలను పరిరక్షిస్తూ, ప్రజలను కాపాడాల్సిన పోలీసులు లంచగొండులుగా మారిపోతున్నారు. ఈ క్రమంలో ఓ లంచగొండి ఎస్ఐకు కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
హైదరాబాద్ నగరంలోని ప్రస్తుతం మాదాపూర్‌లో ఎస్ఐగా పని చేస్తూ వచ్చిన కె.రాజేంద్ర గతంలో రాయదుర్గం పోలీసు స్టేషనులో విధులు నిర్వహించారు. గత 2013 జూన్ నెలలో స్వాధీనం చేసుకున్న ఇర్షాద్ ఖురేషీ వాహనాన్ని తిరిగి ఇచ్చేందుకు రాజేంద్ర రూ.10 వేలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఖురేషీ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. 
 
ఆ తర్వాత రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. మాటు వేసి రాజేంద్రకు ఖురేషీ రూ.10 వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ కేసులో హైదరాబాద్ ఏసీబీ కోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. 
 
నిందితుడైన ఎస్ఐ రాజేంద్రను దోషిగా తేల్చి రెండేళ్ళ జైలుశిక్షతో పాటు రూ.5 వేల జరిమానా కూడా విధించింది. తీసుకున్న లంచంతో పాటు జరిమానాను తిరిగి చెల్లించకుంటే మరో మూడు నెలలు జైలు శిక్షను పొడగించాలని కోర్టు ఆదేశించింది.