1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 డిశెంబరు 2022 (10:12 IST)

14,190 మంది మహిళల అక్రమ రవాణా.. 18మంది అరెస్ట్

woman
హైదరాబాద్ నగరంలో భారీ ముఠా గుట్టు రట్టు అయ్యింది. 14,190 మంది మహిళలను అక్రమ రవాణా చేసిన ముఠా గుట్టును పోలీసులు పట్టుకున్నారు. 
 
సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర మంగళవారం తెలియజేసిన వివరాల్లోకి వెళితే.. 18 మంది సభ్యుల్లో ఒక్కొక్కరు వందలాది మంది అమ్మాయిలతో కనెక్ట్‌ అయ్యారని తెలిపారు. 
 
సైబరాబాద్ పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, SOT స్లీత్‌ల సమన్వయంతో, అనేక సంవత్సరాలుగా 14,190 మంది మహిళలను ప్రలోభపెట్టి లేదా బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న ముఠాలోని 18 మంది సభ్యులను అరెస్టు చేశారు. నగరంలో జరుగుతున్న అక్రమ రవాణా, వ్యభిచారం కేసుల్లో దాదాపు 70 శాతం ఈ ముఠాదే బాధ్యత అని పోలీసులు చెప్తున్నారు. 
 
అరెస్టయిన వారిలో హైదరాబాదులోని ఓ ప్రముఖ హోటల్ నిర్వాహకుడు అదీమ్, రాజు, రాకేష్ ఉన్నారు. అరెస్టయిన మిగతా వారిని సమీర్, హర్బింధర్ కౌర్, సల్మాన్ ఖాన్, అబ్దుల్ కరీం, జోగేశ్వర్ రావు, సాయిబాబు గౌడ్, ప్రసాద్, అఫ్సర్, గంగాధర్, ఫయాజ్, విష్ణు, సుధీర్, రిషి, శ్రీనివాస్, అబ్దుల్ రఫీక్, సర్బేశ్వర్‌లుగా గుర్తించారు.
 
సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 18 మంది సభ్యుల్లో ఒక్కొక్కరు వందలాది మంది అమ్మాయిలతో కనెక్ట్‌ అయ్యారని తెలిపారు. 14,190 మంది బాధితుల్లో ఎక్కువ మంది పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు కాగా, ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర ఉన్నాయి. 
 
బాధితుల్లో కొందరు బంగ్లాదేశ్, నేపాల్, థాయ్‌లాండ్, ఉజ్బెకిస్థాన్, రష్యాకు చెందినవారు. ముఠా సభ్యులపై 37 కేసులు నమోదయ్యాయని రవీంద్ర తెలిపారు.
 
ఈ ముఠా ఆదాయాన్ని 70:30 నిష్పత్తిలో బాధితులతో పంచుకునేదని రవీంద్ర చెప్పుకొచ్చారు. ఈ ముఠా ఎండీఎంఏ, ఇతర డ్రగ్స్‌తో బాధితులను, ఖాతాదారులను ప్రభావితం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
 
వాట్సాప్ గ్రూపులు, వెబ్‌సైట్‌ల ద్వారా వీరి కమ్యూనికేషన్ జరిగిందని రవీంద్ర చెప్పారు. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లలో కాల్‌ సెంటర్లను వీరు నడుపుతున్నారు. 
 
విదేశాల నుంచి వచ్చే అమ్మాయిల విషయానికి వస్తే.. బాధితురాలి చిత్రాలను ఈ ముఠా ఖాతాదారుడితో పంచుకుంటారు.  క్లయింట్ అంగీకరించిన తర్వాత, విమాన టిక్కెట్లు, హోటల్ గదులు రిజర్వ్ చేస్తారని రవీంద్ర వెల్లడించారు. 
 
ఈ ముఠా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో చెల్లింపులను అంగీకరించేదని... ముఠాలోని కొందరు వ్యక్తులు కొన్ని హోటళ్లలో సిబ్బందిగా కూడా పనిచేస్తున్నారు.
 
నవంబర్ మధ్యలో సన్ సిటీలో వివేక్, ఇర్ఫాన్‌లను మానవ అక్రమ రవాణాపై అదుపులోకి తీసుకున్నప్పుడు ఈ కేసు వెలుగులోకి వచ్చిందని రవీంద్ర చెప్పారు.