1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

చౌరస్తాలో కనిపించిన మహిళలు.. ఠాణాకు తీసుకెళ్లి చితకబాదిన ఎల్బీ నగర్ పోలీసులు

police suspend
హైదరాబాద్ నగరంలో మరో దారుణం వెలుగు చూసింది. ఎల్బీ నగర్ చౌరస్తాలో కనిపించిన ముగ్గురు మహిళలను స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదారు. ఈ దాడి ఘటన వెలుగులోకి రావడంతో ఈ చర్యకు పాల్పడిన పోలీసులను రాచకొండ పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో హెడ్ కానిస్టేబుల్ శివశంకర్, మహిళా కానిస్టేబుల్ సుమలత ఉన్నారు. ఈ ఘటన ఈ నెల 15వ తేదీ ఆర్థరాత్రి చోటుచేసుకుంది. 
 
కొందరు పోలీసులు ఈ నెల 15వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా.. ఎల్బీనగర్ చౌరస్తాలో పోలీసులకు లంబాడా తెగకు చెందిన ముగ్గురు మహిళలు కనిపించారు. స్థానికంగా ఇబ్బంది కలిగిస్తున్నారంటూ రాణాకు తీసుకొచ్చారు. సెక్షన్ 290 కింద కేసు నమోదు చేశారు. వారిలో మీర్‌పేటకు చెందిన మహిళ.. తమను ఎందుకు తీసుకొచ్చారని గట్టిగా ప్రశ్నించారు. 
 
ఇది పోలీసులకు ఆగ్రహం తెప్పించింది. ఆ సమయంలో విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు శివశంకర్, సుమలత ఆమెపై తమ లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ దెబ్బలకు ఆమె ఎడమ మోకాలి పైభాగం పూర్తిగా కమిలింది. అరికాళ్లపై కొట్టడంతో నడవలేని పరిస్థితి. రాత్రంతా స్టేషనులో ఉంచి, ఉదయం ఇంటికి పంపించారు. ఈ వ్యవహారంలో రాత్రి విధుల్లో ఉన్న ఎస్ఐ పాత్రపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన సూచనతోనే దాడి జరిగినట్లు బాధితురాలు ఆరోపించారు. కేసు నమోదైంది. ఈ దాడి ఘటన వెలుగులోకి రావడంతో రాచకొండ కమిషనర్ చౌహాన్ విచారణకు ఆదేశించారు.