శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: గురువారం, 15 అక్టోబరు 2020 (09:10 IST)

కష్ట కాలంలో రాజకీయాలను పక్కన పెట్టి ప్రజలను ఆదుకోండి- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి నిన్న, మొన్న భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన ముషీరాబాద్, అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రాంతాలను ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఎమ్మెల్సీ రామచంద్రరావు నగర బిజెపి అధ్యక్షులు శ్యాంసుందర్ గౌతం రావుతో కలిసి పర్యటించారు. 
 
హైదరాబాదులో పరిస్థితిని చూసి ఢిల్లీ నుంచి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్న మంత్రి శ్రీ కిషన్ రెడ్డి నేరుగా ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం లోని అరుంధతి నగర్ నాలా, అరవిందు నగర్లో రోడ్లపై పొంగిపొర్లుతున్న నీటిని, సూరజ్ నగర్‌లో ఇప్పటికీ నీటిలోనే ఉన్న ఇళ్లను పరిశీలించారు.
 
అనంతరం అంబర్పేట అసెంబ్లీ నియోజకవర్గం లోని మల్లికార్జున్ నగర్‌లో ఇప్పటికీ రోడ్లపై వరద నీరు ప్రవహిస్తున్న తీరును చూసి స్థానికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మల్లికార్జున నగర్‌లో ఇటీవల వర్షపు నీటి వల్ల కరెంట్ షాక్‌తో మృతి చెందిన యువకుడు రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బాపు నగర్ ముసరాంబాగ్ బ్రిడ్జ్, అంబేద్కర్ నగర్, శాంతినగర్, రత్న నగర్‌లో మంత్రి కిషన్ రెడ్డి పర్యటించి ప్రజలకు భరోసా ఇచ్చారు.
 
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల హైదరాబాదులో లక్షలాది మంది ప్రజలు నిత్యావసర వస్తువులు కూడా లేక ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా పిల్లలు వృద్ధుల బాధలు వర్ణనాతీతం అని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఒకపక్క కరోనా, మరోపక్క వర్షం- వరద నీళ్లతో  ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మరికొంత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
 
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం NDRF బృందాలను రంగంలోకి దింపి రాష్ట్ర ప్రభుత్వానికి విపత్తు సాయం చేస్తున్నాయని పారా మిలటరీ బలగాలు కూడా సిద్ధంగా ఉన్నాయని కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాదులోని పాత బస్తీలోని కాలనీలల్లో మౌలిక వసతుల కల్పన చేయాలని పురాతన డ్రైనేజీ లను మార్చాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ సిటీలనే కాకుండా పాత బస్తీ, కాలనీలను అభివృద్ధి చేయాలని కిషన్ రెడ్డి అన్నారు.
 
బీజేపీ క్యాడర్ ఇప్పటికే విపత్తులో సాయం అందిస్తుందని వారికి ధన్యవాదాలు అని మంత్రి అన్నారు. ఈ కష్ట కాలంలో రాజకీయాలు పక్కన పెట్టి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఏ సాయం అందించడానికైనా సిద్ధమని కిషన్ రెడ్డి అన్నారు. ముషీరాబాద్, అంబర్ పేట అసెంబ్లీ నియోజకవర్గ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కిషన్ రెడ్డి ఖైరతాబాద్, నాంపల్లి, జూబ్లీహిల్స్, సనత్ నగర్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజక వర్గాల్లోను పర్యటించనున్నారు.