గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 ఆగస్టు 2022 (15:23 IST)

జూబ్లీహిల్స్‌ గ్యాంగ్ రేప్.. నెట్టింట వీడియోలు వైరల్..

gang rape
జూబ్లీహిల్స్‌ గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నాయని 17 ఏళ్ల మైనర్‌ బాలిక తల్లిదండ్రులు మహిళా భద్రతా విభాగం అధికారులను ఆశ్రయించారు. 
 
బాలికతో ఐదుగురు నిందితులు అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియోలు, ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నాయని.. వాటిని వెంటనే తొలగించాలని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
అత్యాచారానికి పాల్పడిన రెండు నెలల తర్వాత కూడా ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడంతో షాకయ్యారు. 
 
తాజాగా మైనర్‌ బాలిక తల్లిదండ్రులు గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి.. నిందితులతో పాటు ఆమె రెండు వీడియోలు, ఫోటోలను ఇన్‌స్టాలో గమనించారు. ఒక ఫోటోలో బాలిక మెడపై గాయం గుర్తులు ఉండగా.. రెండవ ఫోటో మరియు రెండు వీడియోలలో నిందితులు బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. 
 
అంతేకాదు ఒక వీడియోలో అయితే  బాలిక, ముగ్గురు మైనర్ నిందితుల ముఖాలు స్పష్టంగా కనిపించాయి. బాధితురాలి ముఖం కనిపించే వీడియోను 2000 మందికి పైగా లైక్ చేశారు. 
 
మైనర్‌ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహిళా భద్రతా విభాగం ఈ కేసును హైదరాబాద్‌ సైబర్‌క్రైం పోలీసులకు బదిలీ చేసింది. జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  
 
2022 మే 28న హైదరాబాద్‌లో జరిగిన అత్యాచార ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని అమ్నీషియా పబ్ నుంచి బయటకు తీసుకెళ్లిన మైనర్ బాలికపై సాదుద్దీన్‌ సహా మరో నలుగురు మైనర్‌ బాలురు సామూహిక అత్యాచారం చేశారు. 
 
ఇన్నోవా కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జూన్‌ 2న బాలిక, నిందితుల వీడియోలు బయటకు వచ్చాయి. దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు అందరినీ అరెస్ట్ చేశారు.