శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

టీడీపీని వీడుతానంటూ కంటతడిపెట్టుకున్న కొత్తకోట దయాకర్

kottakota dayakar
తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మరింతగా బలహీనపడనుంది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతున్నారు. తాజాగా మరో సీనియర్ నేతగా ఉన్న కొత్తకోట దయాకర్ రెడ్డి కూడా పార్టీని వీడుతానంటూ ప్రకటించారు. ఈ విషయాన్ని వెల్లడించే సమయంలో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నారు. పైగా, కార్యకర్తలు సూచించిన పార్టీలోకి వెళ్తానని తెలిపారు. 
 
నిజానికి ఉమ్మడి ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టీడీపీ కంచుకోట. రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. టీడీపీ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ప్రాభవం కోల్పోయింది. అయితే, పార్టీ కేడర్ మాత్రం ఇప్పటికీ పదిలంగానే ఉంది. 
 
ఇక, మహబూబ్‌నగర్ పేరు చెప్పగానే గుర్తొచ్చే పేరు కొత్తకోట దయాకర్‌రెడ్డి. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన భార్య సీతా దయాకర్‌ రెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్‌‌గా, దేవరకద్ర ఎమ్మెల్యేగా వ్యవహరించారు. ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన కొత్తకోట దంపతుల రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. 
 
ఈ నేపథ్యంలో కొత్తదారులు వెతుక్కుంటున్నారు. పార్టీకి చెందిన పలువురు నేతలు మాత్రం తమదారులు తాము వెతుక్కున్నా దయాకర్‌రెడ్డి దంపతులు మాత్రం టీడీపీని నమ్ముకుని ఉండిపోయారు. అయితే, మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు పార్టీని వీడక తప్పడం లేదని దయాకర్‌రెడ్డి తాజాగా ప్రకటించారు. 
 
గురువారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా దేవరకద్రలో భార్య సీతతో కలిసి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దయాకర్‌ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా పార్టీ మార్పు తప్పనిసరి అని భావిస్తున్నట్టు వెల్లడించారు. టీడీపీకి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో భావోద్వేగానికి గురైన ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. కార్యకర్తలు సూచించిన పార్టీలోకి వెళ్తనని పేర్కొన్నారు.