మంగళవారం, 16 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 ఆగస్టు 2022 (09:10 IST)

ఇది మీ ఇల్లు అనుకోండి బాబు... అపుడపుడూ ఢిల్లీకి రండి..

babu - modi
సుధీర్ఘకాలం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. శనివారం ప్రధాని మోడీ నేతృత్వంలోని ఆజాదీ కా అమృత్ మహోత్సవ జాతీయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు ప్రధానితో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 
 
ఈ సమావేశానికి హాజరైన వారంతా తేనీరు సేవిస్తుండగా, ప్రధాని అందరి వద్దకు వచ్చి పలకరించినట్లు తెలిసింది. చంద్రబాబు దగ్గరకు వచ్చినప్పుడు కొద్దిసేపు పక్కకు జరిగి ఇద్దరూ 5 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. 'మీరీ మధ్య ఢిల్లీకి రావడంలేదు. అప్పుడప్పుడూ వస్తూ ఉండండి' అని బాబుతో ప్రధాని అన్నట్లు తెదేపా వర్గాలు తెలిపాయి. 
 
అలాగే, ఈ సారి ఢిల్లీకొచ్చినప్పుడు ప్రత్యేకంగా కలుస్తానని చంద్రబాబు చెప్పగా, 'తప్పకుండా రండి. ఇది మీ ఇల్లు అనుకోండి. రావాలనుకున్నప్పుడు ముందుగా మా ఆఫీసుకు చెప్పండి' అన్నట్లు సమాచారం. చంద్రబాబు కుటుంబసభ్యుల యోగక్షేమాలను అడిగినట్లు తెలిసింది. 
 
కేంద్ర మంత్రులు అమిత్‌ షా, గడ్కరీ తదితరులతోనూ బాబు ప్రత్యేకంగా మాట్లాడారని తెదేపా వర్గాలు వెల్లడించాయి. కాగా, ఈ భేటీ వచ్చే 2024 ఎన్నికల్లో టీడీపీ బీజీపీల మధ్య దోస్తీకి దారితీయొచ్చని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.