1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2022 (16:28 IST)

బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా

modi - nitish
బీహార్ రాష్ట్రంలో మంగళవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి పదవికి నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన గవర్నర్‌కు అందజేశారు. ఇటీవల మహారాష్ట్రలో శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండేతో పాటు ఆయన వర్గాన్ని తనవైపునకు తిప్పుకుని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూలదోసిన కమలనాథులు ఇపుడు అలాంటి పాచికనే బీహార్‌లోనూ విసిరారు.
 
ఈ విషయాన్ని పసిగట్టిన నితీశ్ కుమార్ మంగవారం అత్యవసరంగా పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలతో సమావేశమై బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత తన సీఎం పదవికి రాజీనామా చేశారు. అదేసమయంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటించారు. 
 
బీహార్ రాష్ట్ర రాజకీయాలు అనూహ్యంగా మలుపు తిరగడానికి ప్రధాన కారణం జేడీయూ సీనియర్ నేత ఆర్సీపీ సింగ్ అని జేడీయూ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల ఆర్సీపీ సింగ్ బీజేపీతో సన్నిహితంగా మెలుగుతున్నారు. తరచుగా నితీశ్ కుమార్‌ను విమర్శిస్తూ సొంత పార్టీలో కలకలం రేపుతున్నారు. 
 
దాంతో, ఆర్సీపీ సింగ్ మరో ఏక్ నాథ్ షిండే అవుతాడేమోనన్న అనుమానాలు జేడీయూ వర్గాల్లో పొడసూపాయి. జేడీయూలో చీలికలు తెచ్చేందుకు బీజేపీ యత్నిస్తోందంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో, నితీశ్ కుమార్ వేగంగా పావులు కదిపారు. పార్టీ ఎమ్మెల్యేలతో కీలక సమావేశం ఏర్పాటు చేసి, బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నట్టు ప్రకటించారు. అలాగే, సీఎం పదవికి కూడా రాజీనామా చేశారు.