గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (20:27 IST)

బీహార్ వర్శిటీ మాయాజాలం.. 100కు 151 మార్కులు

దేశంలోని రాష్ట్రాల్లో బాగా వెనుకబడిన రాష్ట్రంగా బీహార్‌కు గుర్తింపు వుంది. అయితే తాజాగా ఆ రాష్ట్రానికి ఓ విశ్వవిద్యాలయం అధికారుల నిర్లక్ష్యం మరోమారు బయటపడింది. ఇది తీవ్ర విమర్శలకు కూడా దారితీసింది. 
 
సదరు యూనివర్సిటీ తాజాగా ఫలితాలను విడుదల చేయగా.. వాటిని చూసిన విద్యార్థులే నివ్వెరపోతున్నారు. కొందరికి గరిష్ఠానికి మించి మార్కులు రాగా.. ఇంకొందరికి గుండు సున్నాలు వచ్చినా, వారు పాసైనట్లు చూపించింది. పలువురు విద్యార్థులు ఫెయిల్ అయినట్లు ప్రకటించిన యూనివర్సిటీ.. వారిని పైతరగతికి ప్రమోట్ చేసినట్టు మార్క్​షీట్‌లో పేర్కొనడం చర్చకు దారితీసింది.
 
దర్భంగా జిల్లాలోని లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఫలితాల్లో ఎంఆర్జేడీ కాలేజీకి చెందిన బీఏ మూడో ఏడాది విద్యార్థి అన్మోల్ కుమాకుకు 'పొలిటికల్ సైన్స్ హానర్స్' నాలుగో పేపర్‌లో 100 మార్కులకుగాను 151 రావడం గమనార్హం. 
 
అతడికి మొత్తంగా 420 మార్కులు వచ్చి అతడు ఉత్తీర్ణత సాధించగా మార్క్​షీట్‌లో మాత్రం అతడు ఫెయిల్ అయినట్లు చూపిస్తోంది. మరోవైపు, యూనివర్సిటీ పరిధిలోని ఎంకేఎస్ కళాశాలలో చదువుతున్న సోనూకుమార్‌కు.. ఓ పేపర్‌లో సున్నా వచ్చింది. అకౌంటెన్సీ, ఫైనాన్స్ హానర్స్ నాలుగో పేపర్‌లో సున్నా మార్కులు వచ్చినట్లు ఫలితాల్లో తేలింది. అయినప్పటికీ పరీక్షలో పాసైనట్లు మెమోలో కనిపించింది.