బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 ఆగస్టు 2022 (20:23 IST)

తల్లి రుణం తీర్చలేనిది.. రిటైర్మెంట్ రోజున మధుర జ్ఞాపకం

Mother
Mother
తల్లి రుణం తీర్చలేనిది. అలాంటి తల్లి కళ్లలో ఆనందాన్ని చూడాలనుకున్నాడో కొడుకు. మూడు దశాబ్దాలకుపైగా ఉపాధ్యాయురాలిగా పనిచేసి కుటుంబ ఉన్నతి కోసం పాటుపాడిన ఓ తల్లికి ఆమె కుమారుడు ఊహించని బహుమతి ఇచ్చాడు.
 
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌‌లోని అజ్మీర్‌కు చెందిన సుశీలా చౌహాన్ పిసంగన్‌లోని కేసర్‌పురా హైస్కూల్‌లో 33 ఏళ్లపాటు ఉపాధ్యాయురాలిగా సేవలందించారు. శనివారం ఆమె పదవీ విరమణ చేశారు.
 
తల్లి రిటైర్ కాబోతోందని తెలుసుకున్న అమెరికాలో ఉన్న ఆమె కుమారుడు యోగేశ్ చౌహాన్ నాలుగు రోజుల క్రితమే స్వగ్రామానికి చేరుకున్నారు. యోగేశ్ గత 14 సంవత్సరాలుగా భార్యాపిల్లలతో కలిసి అమెరికాలోనే ఉంటున్నారు.
 
తమను ఓ స్థాయిలో నిలబెట్టిన తల్లికి రిటైర్మెంట్ రోజును ఓ మధుర జ్ఞాపకంగా మలచాలని అనుకున్నాడు. ఈ క్రమంలో అతడి మెదడులో ఓ అద్భుతమైన ఆలోచన మెరిసింది. 
 
స్కూలు నుంచి ఇంటికి ఆమెను హెలికాప్టర్‌లో తీసుకురావాలని అనుకున్నాడు. ఆలోచన రాగానే మరేమాత్రం ఆలస్యంగా చేయకుండా ఓ హెలికాప్టర్‌ను బుక్ చేశాడు. 
 
హెలికాప్టర్ రైడ్‌కు అధికారుల నుంచి అనుమతులు తీసుకున్న యోగేశ్.. స్కూల్‌లో రిటైర్మెంట్ కార్యక్రమం పూర్తయిన వెంటనే తల్లిని హెలికాప్టర్‌లో ఇంటికి తీసుకొచ్చాడు. 
 
ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. తల్లి కళ్లలో ఆనందం కోసం కుమారుడు పడిన తపనను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.