1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : గురువారం, 17 ఆగస్టు 2023 (15:25 IST)

పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. ట్రాన్స్‌జెండర్‌గా మార్చి... మోసం...

victim woman
పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను ట్రాన్స్‌జెండర్‌గా మార్చారంటూ ఓ భ్రమరాంభిక అనే మహిళ వాపోతుంది. పైగా తన నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని ఓ వ్యక్తి మోసం చేశారంటూ ఆరోపించింది. కృష్ణా జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఆలోకం పవన్‌ కుమార్‌ (ట్రాన్స్‌జెండర్‌గా మారిన తర్వాత భ్రమరాంబిక), విజయవాడ పరిధిలోని కృష్ణలంకకు చెందిన ఈలి నాగేశ్వరరావు సుమారు ఆరేళ్ల కిందట కానూరు వీఆర్‌ సిద్ధార్థ కళాశాలలో బీఈడీ కలిసి చదువుకున్నారు. 
 
ఆ సమయంలో ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. అది ప్రేమగా మారింది. చదువు పూర్తయిన తర్వాత 2019లో ఇద్దరూ కృష్ణలంక సత్యంగారి హోటల్‌ సెంటర్‌ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. గృహ యజమానికి మగవారిగానే పరిచయం చేసుకొని సహజీవనం చేశారు. ట్యూషన్‌ పాయింట్‌ నిర్వహించారు. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఇద్దరూ మగవారిగానే తెలుసు. 
 
కొద్ది రోజుల తర్వాత ఇద్దరూ వివాహం చేసుకోవాలనుకున్నారు. పవన్‌ కుమార్‌ను నాగేశ్వరరావు ఢిల్లీ తీసుకెళ్లి అవయవ మార్పిడి శస్త్రచికిత్స చేయించాడు. అతడి పేరును భ్రమరాంబికగా మార్చాడు. శస్త్రచికిత్స ఖర్చు సుమారు రూ.11 లక్షలు భ్రమరాంబిక చెల్లించింది. వివాహం చేసుకుంటాడన్న నమ్మకంతో 11 సవర్ల బంగారం, రూ.26 లక్షల నగదు ఆమె నాగేశ్వరరావుకు ఇచ్చింది. 
 
గతేడాది డిసెంబర్‌లో పెళ్లికి నిరాకరించిన నాగేశ్వరరావు ఆమెను ఇంటి నుంచి పంపించేశాడు. తన తల్లి విజయలక్ష్మితో కలిసి మంగళగిరి వెళ్లిపోయాడు. గత్యంతరం లేని స్థితిలో ఆమె పెనమలూరులోని తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. నాగేశ్వరరావు మంగళగిరిలో ఉన్నాడన్న సమాచారంతో అతడిపై ఫిర్యాదు చేసేందుకు ఇటీవల భ్రమరాంబిక మంగళగిరి పోలీసులను ఆశ్రయించింది. 
 
వ్యవహారం మొత్తం కృష్ణలంక కేంద్రంగా సాగినందున అక్కడ ఫిర్యాదు చేయాలని మంగళగిరి పోలీసులు సూచించారు. దాంతో ఆమె కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నాగేశ్వరరావు, అతడి తల్లి విజయలక్ష్మిలపై ఈ నెల పదో తేదీన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.