శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

ఖమ్మంలో దారుణం : క్లీనర్‌ను ఇనుపరాడ్డుతో కొట్టి చంపేసిన డ్రైవర్

తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో దారుణం జరిగింది. ఓ లారీ డ్రైవర్ అత్యత కిరాతకంగా ప్రవర్తించాడు. లారీ క్లీనర్‌ను లారీ డ్రైవర్ ఇనుపరాడ్‌తో కొట్టడమే కాకుండా కత్తితో పొడిచి దారుణంగా చంపేశాడు. అనంతరం తన లారీలో ఆ మృతదేహాన్ని వేసుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన  ఖమ్మం జిల్లా కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కాకినాడకు చెందిన లారీ డ్రైవర్, క్లీనర్ లారీలో పనిమీద కరీంనగర్‌కు వచ్చి తిరిగి బయలుదేరారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో క్లీనర్‌ రాజును డ్రైవర్ నైఫ్‌రాజు రాడ్‌తో కొట్టి, కత్తితో పొడిచి హత్య చేశాడు. 
 
ఖమ్మం జాతీయ రహదారి పక్కన ఉన్న కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఈ విషయం తెలిపాడు. హత్య చేసి ఆ మృతదేహాన్ని లారీలోనే పోలీస్ స్టేషన్‌కు తీసుకురావడంతో పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. 
 
గొడవపడిన క్రమంలో తన ప్రాణాలు కాపాడుకోవడానికే క్లీనర్‌ను హత్య చేశానని డ్రైవర్ అంటున్నాడు. కత్తితో తనను హత్య చేయాలని క్లీనర్ చూడడంతో తానే పొడిచేశానని చెప్పాడు. దీనిపై కొణిజర్ల పోలీసులు కేసు నమోదు చేసి, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.