బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

నేడు హైదరాబాద్ నగర మేయర్ ఎన్నిక - బల్దియా చుట్టూ భారీ భద్రత

హైదరాబాద్ నగర మేయర్ ఎన్నిక గురువారం జరుగనుంది. ఇటీవల జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాలేదు. దీంతో హైదరాబాద్ నగర ప్రథమ పౌరురాలి ఎన్నిక ఆసక్తికరంగా మారింది. 
 
ఇందుకోసం జీహెచ్ఎంసీ సమావేశం గురువారం జరుగనుంది. ఇందులో మేయర్‌, డిప్యూటీ మేయర్‌లను ఎన్నుకోనున్నారు. తొలుత ఉదయం 11 గంటలకు గ్రేటర్‌ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన 149 మంది కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేస్తారు. మధ్యాహ్న 12.30 గంటలకు మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. 
 
ఎన్నిక ప్రక్రియకు కలెక్టర్‌ శ్వేతామహంతి ప్రిసైడింగ్‌ అధికారిగా వ్యవహరించనున్నారు. ఎన్నికల పరిశీలకునిగా ఐఏఎస్‌ అధికారి సందీప్‌కుమార్‌ సుల్తానియాను ఎన్నికల సంఘం నియమించింది. కౌన్సిల్‌లో 149 మంది కార్పొరేటర్లు (ఒకరు మరణించారు), 44 మంది ఎక్స్‌అఫీషియోలతో కలిపి మొత్తం సభ్యులు 193. 
 
వీరిలో 97 మంది హాజరైతే కోరం ఉన్నట్టుగా పరిగణిస్తారు. వారిలో ఎక్కువ మంది సభ్యుల మద్దతున్న వారు మేయర్‌, డిప్యూటీ మేయర్‌గా ఎన్నికవుతారు. ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులకు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంటుంది. మేయర్‌ ఎన్నిక నేపథ్యంలో అధికార యంత్రాంగం సకల ఏర్పాట్లూ చేసింది.
 
ముఖ్యంగా, జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు ప్రవేశ ద్వారాల వద్ద పోలీసులు రాకపోకలను పరిశీలించారు. కార్యాలయ ఆవరణలోకి ఏ వాహనాలనూ అనుమతించవద్దని నిర్ణయించారు. బారికేడ్లు, ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. 
 
కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు లోనికి అనుమతి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల అథారిటీ జారీ చేసిన పాస్‌లు ఉన్న మీడియా ప్రతినిధులకు మాత్రమే అనుమతి. బుధవారమే కొందరు ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు ఆఫీస్‌ వద్ద బారికేడింగ్‌ ఏర్పాటును పరిశీలించారు.