సీజనల్ వ్యాధుల పట్ల మరింత జాగ్రత్త: కేటీఆర్
సీజనల్ వ్యాధుల ఎదుర్కొనేందుకు ప్రతి ఆదివారం తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమంలో మంత్రి కే. తారకరామారావు ఈ రోజు పాల్గొన్నారు.
ప్రతి ఆదివారం పది గంటలకు 10 నిమిషాల పాటు అనే పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఈ వారం కూడా మంత్రి కే.తారకరామారావు ప్రగతి భవన్ లోని ఇంటితోపాటు, పరిసరాలను పరిశీలించారు. తాజాగా కురిసిన వర్షాలకు పలు పాత్రల్లో నిండిన నీటిని ఖాళీ చేయడంతో పాటు వివిధ ప్రాంతాల్లో పేరుకుపోయిన వాన నీటిని సైతం తొలగించారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సీజనల్ వ్యాధుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. తాజాగా ప్రారంభమైన వర్షాకాల సీజన్ తో మలేరియా డెంగ్యూ చికెన్గున్యా వంటి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉన్నదని ఇందుకు ప్రధాన కారణమైన దోమలను అరి కట్టాల్సిన అవసరం ఉందన్నారు.
దోమలు ఇళ్లలో పేరుకుపోయిన మంచి నీటి పైన వేగంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ప్రభుత్వం చేస్తున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలకు అదనంగా ప్రతి ఒక్కరు తమ ఇళ్లతో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొనే అంశంపైన ప్రధానంగా దృష్టి సారించాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రజలను కోరారు.
ప్రతివారం కేవలం పది నిమిషాల పాటు తమ ఇంటి పరిశుభ్రత, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం కేటాయించాలని తద్వారా ప్రస్తుత వర్షాకాలంలో వచ్చే అన్ని రకాల సీజనల్ వ్యాధుల ను అరికట్టే అవకాశం కలుగుతుందని తెలిపారు.