శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 జూన్ 2021 (13:26 IST)

కోడలి పట్ల అత్త అమానుషం.. కరోనా అంటించి.. ఇంటి నుంచి గెంటేసింది..!

కోడలి పట్ల అత్త అమానుషంగా ప్రవర్తించింది. కరోనా పాజిటివ్ కారణంతో కోడలి పట్ల అత్తామామలు అమానవీయంగా ప్రవర్తించారు. చంటి పిల్లలున్నారని కూడా చూడకుండా కోడలిని ఇంట్లో నుంచి గెంటేశారు. కాగా.. బంధువుల చొరవతో బాధితురాలు శనివారం సాయంత్రం పుట్టింటికి చేరింది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌కు చెందిన ఓ మహిళకు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం సోమారిపేట పరిధిలోని నెమిలిగుట్టతండావాసితో మూడేళ్ల క్రితం వివాహమైంది. కొడుకు, కూతురు ఉన్నారు. 
 
బాధితురాలి భర్త బతుకుదెరువు కోసం ఏడు నెలల కిందట ఒడిశా వెళ్లి అక్కడే ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఐదు రోజుల క్రితం అత్త కరోనా బారినపడగా హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతోంది. కోడలు భౌతిక దూరాన్ని పాటించడాన్ని అత్త జీర్ణించుకోలేకపోయింది. నేను చనిపోతే మీరు హాయిగా బతుకుతారా అంటూ కోడలిని తరచూ ఆలింగనం చేసుకోవడం, పిల్లలను బలవంతంగా దగ్గరికి తీసుకోవడం చేసేది. 
 
దీంతో కోడలికి సైతం మూడ్రోజుల కిందట కరోనా సోకగా అత్తమామలు ఆమెను ఇంట్లో నుంచి గెంటేశారు. విషయం తెలుకున్న బాధితురాలి సోదరి ఆమెను ఎల్లారెడ్డిపేట మండలానికి ఓ ఆటోలో రప్పించింది. రాచర్ల గొల్లపల్లిలోని తన సొంతింట్లో హోం క్వారంటైన్‌లో ఉంచింది. తనకు కరోనా సోకడానికి అత్తే కారణమని, అత్త చేసిన వింత చేష్టలతో తాను కొవిడ్‌ బారిన పడ్డానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.