గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 డిశెంబరు 2021 (19:54 IST)

కొత్త సంవత్సర వేడుకలపై పోలీసుల ఆంక్షలు... న్యూ గైడ్‌లైన్స్ జారీ

మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభంకానున్నాయి. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు యువతీయువకులతో పాటు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అయితే కరోనా, ఒమిక్రాన్ వైరస్‌ల వ్యాప్తి కారణంగా ఈ వేడుకలపై పలు ఆంక్షలు విధించాల్సిన నిర్బంధ పరిస్థితి నెలకొంది. 
 
ముఖ్యంగా, నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని పబ్స్, హోటళ్లు, క్లబ్‌లకు హైదరాబాద్ నగర కొత్త కమిషనర్ ఆనంద్ కొత్త మార్గదర్శకాలను జారీచేశారు. న్యూ ఇయర్ వేడుకల పార్టీల్లో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పబ్‌లు, రెస్టారెంట్లు పక్కన ఉన్న స్థానికులను ఇబ్బందులకు గురిచేయొద్దని ఆయన సూచించారు. ఈ అంశంపై స్థానికులు ఫిర్యాదు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
అంతేకాకుండా, కరోనా రెండు డోసులు వేసుకున్న వారికి మాత్రమే కొత్త సంవత్సర వేడుకలకు అనుమతి ఇవ్వాలని, పరిమితికి మించి పాస్‌లు జారీ చేయొద్దని సూచించారు. కోవిడ్ రూల్స్ అతిక్రమిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. 
 
అలాగే, పార్టీల్లో డ్రగ్స్ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. డిసెంబరు 31వ తేదీ దాటిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని ఇందులో పట్టుబడితే మాత్రం తీవ్ర చర్యలు తప్పవని కొత్త కమిషనరు ఆనంద్ హెచ్చరించారు.