శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 జనవరి 2021 (10:14 IST)

తెలంగాణాలో తెరాసకు షాక్ : బీజేపీలోకి పెరిగిన వలసలు

తెలంగాణ రాష్ట్రంలో అధికార తెరాస పార్టీకి ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. తెరాసకు చెందిన అనేక మంది ప్రజాప్రతినిధులు భారతీయ జనతా పార్టీలో చేరేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. ఇందులోభాగంగా, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో కారు దిగి, కాషాయం గూటికి చేరారు. 
 
డిచ్‌పల్లి ఎంపీపీ సహా పది మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఎంపీటీసీలు, ఉప సర్పంచ్‌లు, ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో ఆదివారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ ధర్మపురి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
 
కాగా మాజీ జెడ్పీటీసీ కులాచారి దినేశ్‌కుమార్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. డిచ్‌పల్లి ఎంపీపీ గద్దె భూమన్న, వైస్‌ ఎంపీపీ శ్యాంరావుతో పాటు పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు శనివారం టీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి రాజీనామా చేసి, బీజేపీలో చేరేందుకు ఢిల్లీ వెళ్లారు. 
 
అయితే, ఆ పార్టీ నాయకుల సూచన మేరకు ఆదివారం హైదరాబాద్‌కు చేరుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఇక డిచ్‌పల్లి మండలంలో మొత్తం 17 మంది ఎంపీటీసీలు ఉండగా, ఇందులో ఎంపీపీ సహా ఏడుగురు ప్రస్తుతం కాషాయ గూటికి చేరారు. త్వరలోనే మిగతా వారు కూడా వస్తారని వారు చెబుతున్నారు. 
 
ఇదిలావుంటే కామారెడ్డిలో టీర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు నియోజకవర్గ నేతలు షాక్ ఇచ్చారు. బీజేపీలో చేరేందుకు కామారెడ్డి నియోజకవర్గ నాయకులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. గతంలో బీజేపీ నుంచి తెరాసలోకి వచ్చిన మాజీ కౌన్సిలర్లు, నాయకులు తిరిగి సొంత గూటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎం.జి వేణుగోపాల్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు డా.సిద్దిరాములు బీజేపీలో చేరేందుకు సిద్ధమైపోయారు.