ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వాసు
Last Modified: మంగళవారం, 30 అక్టోబరు 2018 (15:06 IST)

ఆంధ్ర పోలీసులు తెలంగాణకు అక్కర్లేదట...

ఏ రాష్ట్రంలోనైనా ఎన్నికలు జరిగేటప్పుడు అదనపు పోలీసు బలగాల సాయం కావలసి ఉంటుంది. దాని కోసం ఇరుగుపొరుగు రాష్ట్రాల నుండి పోలీసు బలగాలను రప్పించుకోవడం పరిపాటి. అలా రప్పించుకున్న పోలీసులకు ఆతిథ్య రాష్ట్రం జీతభత్యాలను అందజేయడం కూడా సర్వసాధారణమైన విషయమే.


అయితే, ఇప్పుడు జరగబోతున్న తెలంగాణా ముందస్తు ఎన్నికలకు మాత్రం ఆంధ్ర పోలీసుల సాయం తమకు అక్కర్లేదని తెలంగాణా స్పష్టం చేసేసింది. ఇది కూడా ఎవరో రాజకీయ నాయకుడు చెప్తే ఏమై ఉండేదో కానీ, ఇలా చెప్పింది మాత్రం స్వయంగా తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్. అయితే దీని వెనుక చాలా కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది..
 
కొన్ని రోజుల కిందట జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు ప్రత్యక్షమై కొందరికి డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ తెలంగాణా పోలీసులు అదుపులోకి తీసుకోవడంతోపాటు ఈ సమాచారాన్ని ఎన్నికల సంఘానికి చేరవేశారు. ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించిన ఈసీ.. తెలంగాణలో ఏపీ నిఘా వర్గాల సంచారం ఓటర్లను ప్రలోభ పెట్టడంపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాల్సిందిగా ఏపీ డీజీపీని ఆదేశించింది. 
 
అయితే వారి నుంచి ఇప్పటివరకు ఎలాంటి వివరణ రాని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల సాయాన్ని తెలంగాణ ఎన్నికల్లో తీసుకోకూడదని ఈసీ నిర్ణయించింది. మరి ముందు ముందు ఇంకా ఏమేమి వినాల్సి వస్తుందో... వేచి చూద్దాం...