మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 29 అక్టోబరు 2018 (10:40 IST)

నాడు ఏడు అడుగులు కలిసి నడిచింది.. ఇపుడు మరణంలోనూ కలిసివెళ్లింది...

భర్తతో ఏడడుగులు నడిచి జీవితాంతం ఒకరికొకరు తోడూనీడలా ఉంటామని పెద్దల సాక్షిగా ఏర్పడిన భార్యాభర్తల బంధం చివరకు చావులో కూడా విడిపోమంటూ భర్తతో పాటు భార్య కూడా తనువు చాలించింది. ఈ హృదయ విదారకరమైన సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం సింగారం గ్రామంలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సింగారం గ్రామానికి చెందిన రైతు బండారు శ్రీనివాస్ రెడ్డి కుటుంబకలహాలతో క్షణికావేశంలో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఇకలేడనే విషయాన్ని జీర్ణించుకోలేని భార్య... అపర్ణ ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు హుటాహుటిన అపర్ణ(26)ను హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. 
 
క్షణికావేశంలో భర్త శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం, భర్త మృతిని తట్టుకోలేక భార్య కూడా ఆత్మహత్య చేసుకోవడంతో సింగారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు చనిపోవడం గ్రామంలోని ప్రతిఒక్కరిని కంటతడి పెట్టించింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.