ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 అక్టోబరు 2020 (13:46 IST)

తెలంగాణ వాసులకు అది తీరని లోటు.. పవన్ కల్యాణ్

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తపించిన నిబద్ధత కలిగిన ఉద్యమకారుడని నాయినిని పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు. తెలంగాణ ఉద్యమం తొలి, మలి దశలలో ఆయన గణనీయమైన పాత్ర ఎన్నటికీ మరువలేమని పవన్ పేర్కొన్నారు. కార్మిక నాయకుడు, తెలంగాణవాది, మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి మరణం కార్మిక వర్గానికి, తెలంగాణ వాసులకు తీరని లోటు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
 
కార్మిక నాయకునిగా రాజకీయ జీవితం ప్రారంభించి మూడుసార్లు ఎమ్మెల్యేగా.. ఒక పర్యాయం ఎమ్మెల్సీగా ప్రజలకు అమూల్యమైన సేవలు అందించారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ, తెలంగాణ ఆవిర్భావం తరువాత మంత్రిగా ఆయన పని చేసి ప్రజలకు సేవలందించారన్నారు. ఆయన ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. నరసింహారెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని పవన్ తెలిపారు.