1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థిపై కేసు నమోదు

rajasingh
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలాఖరులో జరుగనున్నాయి. ఇలాంటి సమయంలో హైదరాబాద్ నగరంలోని గోషామహల్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలోకి దికుతున్న రాజాసింగ్‌పై తెలంగాణ మంగళ్‌‍హాట్ పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ స్టేషన్ సీఐ ఏ.రవికుమార్‌ తెలిపిన ప్రకారం.. ఈ నెల 14న అఫ్జల్‌గంజ్‌ పరిధిలో జరిగిన భాజపా ఎన్నికల సమావేశంలో ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో దుమారం లేపాయి. ఎస్ఐ షేక్‌ అస్లాం ఫిర్యాదు మేరకు మంగళ్‌హాట్‌ పోలీసులు ఆయనపై సెక్షన్‌ 153, 153(ఏ) ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. 
 
ఈ కేసు నమోదుపై రాజాసింగ్ స్పందిస్తూ, ఈ నెల 30న జరిగే ఎన్నికలు తనకు రాజకీయంగా జీవన్మరణం లాంటివన్నారు. రాజకీయంగా తనకు శత్రువులు ఎక్కువని, తీవ్రవాద శక్తులను ప్రోత్సహిస్తున్న పార్టీలను తరిమికొట్టాల్సిందే అన్నారు. 
 
తనను ఓడించేందుకు గోషామహల్‌లో మాత్రమే కాదని, ప్రపంచంలోని ముస్లిం ప్రముఖులూ ప్రయత్నిస్తున్నారని, అందుకు పెద్దసంఖ్యలో నిధులు సమీకరిస్తున్నారని ఆరోపించారు. తన ఓటమి కోసం శత్రువులతో చేతులు కలిపే శక్తులపై నిఘా ఉంచానని, ఎన్నికల తర్వాత వారి భరతం పడతానన్నారు.