తెలంగాణాలో నీటి ప్రాజెక్టులను పరిశీలించిన ప్రశాంత్ కిషోర్
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టారు. ఆయన సినీ నటుడు ప్రకాష్ రాజ్‌తో కలిసి ఆ రాష్ట్రంలో చేపట్టిన అనేక నీటి ప్రాజెక్టులను ఆదివారం పరిశీలించారు. ముఖ్యంగా, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భగంగా ఉన్న మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను ఆయన ప్రకాష్ రాజ్‌తో కలిసి పరిశీలించారు. ఆ తర్వాత మల్లన్న నిర్వాసితులతోకలిసి మాట్లాడారు.
రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించిన పీకే బృందం... గత రెండు రోజులుగా తెలంగాణాలో పర్యటిస్తుంది. అలాగే, ప్రపంచంలో అతిపెద్దదైన ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం తుది దశకు చేరుకుంది. ముఖ్యంగా మల్లన్న సాగర్ తెలంగాణకు గుండెకాయ వంటిగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులన్నింటినీ పీకే బృందం పరిశీలించడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటో ఏ ఒక్కరికీ బోధపడటం లేదు.
ఇదిలావుంటే, జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా మరో కూటమిని ఏర్పాటు చేసే విషయంపై ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ దృష్టిసారించారు. ఇందులోభాగంగా ఆయన అనేక మంతి విపక్ష నేతలతో సమావేశమవుతూ మంతనాలు జరుపుతున్నారు. అదేసమయంలో ప్రశాంత్ కిషోర్‌ను తన ఎన్నికల వ్యూహకర్తగా సీఎం కేసీఆర్ నియమించుకున్న విషయం తెల్సిందే.