శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 7 నవంబరు 2023 (08:31 IST)

నేడు హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభ.. హాజరుకానున్న పవన్ కల్యాణ్

Modi
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోభాగంగా, మంగళవారం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ జరుగనుంది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొని ప్రసంగిస్తారు. అలాగే, ఈ సభకు ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌సైతం పాల్గొంటారు. 
 
ఈ నెల 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొనగా, ఆయా పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పోటాపోటీగా బహిరంగ సభలు ర్యాలీలు, సమావేశాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారాన్ని ఉధృతం చేసింది. ఇందుకోసం ఆ పార్టీ అగ్రనేతలు ఒక్కొక్కరుగా రాష్ట్రంలో పర్యటనలు జరుగుతున్నారు. ఇందులోభాగంగా మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు 
 
బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో ఈ బహిరంగ సభ జరుగుతుంది. ఇందులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ సాయంత్రం 5.05గంటలకు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి సభ జరిగే ఎల్బీ స్టేడియానికి చేరుకుని సాయంత్రం 5.30 గంటల నుంచి సాయంత్రం 6.10 గంటల వరకు ఆయన బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగిసిన తర్వాత  సాయంత్రం 6.15 గంటలకు తిరిగి బేగంపేట్‌కు వెళ్లి, అక్కడ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళతారు. 
 
మరోవైపు, ఈ ఆత్మగౌరవ సభను బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం నాటి సభలో ప్రధాని మోడీ చేసే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ బహిరంగ సభకు జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు బీసీ నేతలు హాజరుకానున్నారు.