ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థవంతుడు.. మినష్ భగీరథలో ప్రధాని నరేంద్ర మోడీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థవంతంగా పని చేస్తున్నారంటూ కొనియాడారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమర్థవంతంగా పని చేస్తున్నారంటూ కొనియాడారు. గజ్వేల్లో మిషన్ భగీరథ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ... భారతదేశంలో అత్యంత పిన్న వయసున్న రాష్ట్రం తెలంగాణ. నవజాత శిశువు అయిన తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోందన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఐదు ప్రాజెక్టులు ప్రారంభించడం దేశ సహకార సమాఖ్య వ్యవస్థకు నిదర్శనమన్నారు. ఎరువులు, నీళ్లు, విద్యుత్ విషయంలో కేంద్రం, రాష్ట్రం కలిసి నడుస్తోంది. కేసీఆర్ తనను కలిసిన ప్రతిసారీ నీళ్ల గురించే ఎంతో భావోద్వేగంతో మాట్లాడేవారు. నీళ్లు అనేది సీఎం జీవితంలో ఒక పెద్ద మిషన్‌లా మారిందని అర్థమైందన్నారు. గుజరాత్‌లో ప్రతి ఇంటికి మంచి నీరు ఎలా అందించారో కేసీఆర్ అధ్యయనం చేశానని చెప్పారు. అలాగే తెలంగాణలో కూడా ఇంటింటికీ నీరిస్తామని సీఎం చెప్పి, ఆ కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని గుర్తు చేశారు.
ప్రతి ఒక్కరికి నీళ్లు ఇస్తే మట్టిలో నుంచి బంగారం పండించగల శక్తి ప్రజలకుంది అన్నారు. నీళ్లున్నంతా వరకు నీటి విలువ తెలియదు. నీళ్లను సంరక్షిస్తే కొత్త జీవితం ప్రారంభమవుతుంది. గాంధీ పుట్టిన స్థలం పోరుబందర్‌కు వెళ్లి చూడండి ఒక్కో నీటి బొట్టును ఎలా రక్షిస్తున్నారో చూడండి. రెండు వందల ఏండ్ల కిందట నీటి సమస్య లేకపోయినప్పటికీ నీటి విలువ తెలిసి సంరక్షించుకుంటు వస్తున్నారు.
పార్లమెంట్‌లో గూడ్స్ సర్వీస్ టాక్స్ (జీఎస్టీ) బిల్లుకు మద్దతు తెలిపిన సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్ పార్టీకి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నవ జాత శిశువు అని అయినా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్కడి ప్రభుత్వం పనిచేస్తోందని అభినందించారు. తెలంగాణ విద్యుత్ చరిత్రలో మరో సువర్ణాధ్యాయం మొదలైంది. కోమటిబండలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్టీపీసీ మొదటి దశ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.