గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2023 (12:41 IST)

రూ.9,99,999 ధర పలికిన 9999 ఫ్యాన్సీ నంబర్... ఎక్కడ?

Fancy Number
Fancy Number
హైదరాబాద్ నగరంలో వాహనాల ఫ్యాన్సీ నంబర్లకు భలే డిమాండ్ ఉంది. గతంలో పలుమార్లు ఈ తరహా నంబర్లు లక్షల్లో ధర పలికాయి. తాజాగా మరో ఫ్యాన్సీ నంబర్ ధర రూ.9,99,999గా పలికింది. టీఎస్ 11 ఈజడ్ 9999 అనే నంబరు కోసం అనేక మంది వాహనదారులు పోటీపడటంతో ఒక్కసారిగా రూ.10 లక్షల వరకు ధర పలికింది. ఈ ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఆర్టీఐ ఖజానాకు రూ.18 లక్షల ఆదాయం వచ్చింది. 
 
హైదరాబాద్ నగరంలో ఈస్ట్ జోన్ పరిధిలో మంగళవారం వాహనాల ఫ్యాన్సీ నంబర్ల వేలం పాటలు జరిగాయి. ఈ బిడ్డింగ్ ద్వారా రవాణా శాఖకు రూ.18 లక్షల ఆదాయం సమకూరింది. ముఖఅయంగా, టీఎస్ 11, ఈజడ్ 9999 అనే నంబరు ధర రూ.9,99,999 అమ్ముడు పోయింది. ఈ నంబర్‌ను భారీ ధరకు చర్చ్ ఎడ్యుకేషన్ సొసైటీ దక్కించుకుంది. బిడ్డింగ్‌లో ఈ నంబరుకు అనేక మంది పోటీ పడటంతో కళ్లు చెదిరే ధర పలికింది. ఈ నంబరు కోసం ఖర్చు చేసిన డబ్బుతో మరో కారు కొనుగోలు చేయొచ్చంటూ ఇతర వాహనదారులు వ్యాఖ్యానించారు. 
 
మరోవైపు, టీఎస్ 11 ఎఫ్ఏ 0001 నంబరును కామినేని సాయి శివనాగు అనే వ్యక్తి రూ.3.50 లక్షలకు సొంతం చేసుకున్నారు. టీఎస్ 11 ఎఫ్ఏ 0011 అనే నంబరును శ్యామల రోహిత్ రెడ్డి రూ.1.55 లక్షలకు దక్కించుకున్నారు.