1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

హైదరాబాద్ నగరంలో దంచి కొడుతున్న వర్షం ...

rain
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. దీంతో రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధానంగా కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, కేపీహెచ్‌బీ కాలనీ, ఆల్విన్‌ కాలనీ, ఖైరతాబాద్‌, అమీర్‌పేట, సోమాజీగూడ, నాంపల్లి, మలక్‌పేట్‌, సైదాబాద్‌, పాతబస్తీ, ఎల్బీనగర్‌, సాగర్‌రింగ్‌ రోడ్‌, హస్తినాపురం, సికింద్రాబాద్‌, బేగంపేట, అడ్డగుట్ట, మారేడుపల్లి, ప్యాట్నీ, పారడైజ్‌, చిలకలగూడ, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌, బొల్లారం వర్షం జోరుగా కురుస్తోంది. 
 
అనేక ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి పడుతూనే ఉంది. వర్షం ధాటికి రోడ్లు జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. నేడు పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. 11 జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు, 18 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాటిలో హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలు ఉన్నాయి. 


విజయ్ దేవరకొండ ఉదారత ...
 
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఉదారత చాటుకున్నాడు. ఖుషి చిత్రం తాను తీసుకున్న పారితోషికంలో కోటి రూపాయలను తన అభిమాన కుటుంబాలకు ఇవ్వనున్నట్టు తెలిపారు. మొత్తం వంద కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమానికి మంగళవారం నుంచే శ్రీకారం చుడుతానని చెప్పారు. ఆ వంద కుటుంబాలను ఎంపిక చేసి ఖుషి సక్సెస్ మీట్‌లో డబ్బును అందజేస్తానని సోమవారం వైజాగ్‌లో జరిగిన సక్సెస్ మీట్‌లో వెల్లడించారు. 
 
విజయ్‌ దేవకొండ, సమంత జంటగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రమిది. సెప్టెంబరు 1 విడుదలైన ఈ సినిమా మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా విజయ్‌, శివ నిర్వాణ, సంగీత దర్శకుడు హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ తదితరులు సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ఇందులో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, 'నా మీద, మా సినిమాపైన సోషల్‌ మీడియాలో దాడులు జరుగుతున్నాయి. కొందరు డబ్బులిచ్చి మరీ మా సినిమాపై నెగెటివిటీ తీసుకొస్తున్నారు. 
 
ఎన్నో ఫేక్‌ రేటింగ్స్‌, యూట్యూబ్‌ ఫేక్‌ రివ్యూలనూ దాటుకుని సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతుందంటే కారణం మీ (అభిమానులు) ప్రేమే. మీరిచ్చే ఈ ఎనర్జీ చూస్తుంటే ఇప్పుడు దాని గురించి మాట్లాడాలనిపించడంలేదు. ఆ సంగతి మరో రోజు చూసుకుందాం. ఈ సినిమా విషయంలో మీ ముఖాల్లో నవ్వులు చూడాలనుకునే నా కోరిక నెరవేరింది. అందుకు చాలా ఆనందంగా ఉంది. డబ్బు సంపాదించాలి, అమ్మ, నాన్నలను హ్యాపీగా ఉంచాలి, సమాజంలో గౌరవం కావాలి.. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకునే నేనెప్పుడూ పనిచేస్తుంటా. 
 
కానీ, ఇప్పటి నుంచి మీకోసం పనిచేయాలనుకుంటున్నా. మీరూ ఆనందంగా ఉండాలి. వ్యక్తిగతంగా ఒక్కొక్కరినీ కలిసి 'ఖుషి'ని సెలబ్రేట్‌ చేసుకోవాలని ఉందిగానీ అది వీలుపడదు. అందుకే వంద కుటుంబాలను ఎంపిక చేసి నా సంపాదన నుంచి రూ.కోటిని (ఒక్కో ఫ్యామిలీకి రూ.లక్ష) వారికి పది రోజుల్లో అందిస్తా. మనమంతా దేవర ఫ్యామిలీ. నా ఆనందం, సంపాదనను మీతో పంచుకోకపోతే వేస్ట్‌. నేను అనుకున్న ఈ పని పూర్తయినప్పుడు 'ఖుషి' విషయంలో తృప్తిగా ఉంటా. వివరాలు కోసం సంబంధిత ఫామ్స్‌ని సోషల్‌ మీడియాలో మంగళవారం పోస్ట్‌ చేస్తాం' అని తెలిపారు.