1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 7 జులై 2015 (08:43 IST)

తెరాస ఆఫర్‌ను కాదన్నా.. జైల్లో ఉండేందుకే సిద్ధమై దుస్తులతో వెళ్తున్నా : సండ్ర

టీ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని అరెస్టు చేసేందుకు ముందుగానే పక్కా ప్రణాళికను రచించారని ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడిగా తెలంగాణ రాష్ట్ర ఏసీబీ అరెస్టు చేసిన టీ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రేవంత్ రెడ్డి అరెస్టుకు మూడు రోజుల ముందు కొందరు తెరాస నేతలు నా వద్దకు వచ్చి కేసులు పెట్టి అరెస్టు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. అందువల్ల తమ ఆఫర్‌ను అంగీకరించాలని వారు ఒత్తిడితెచ్చారన్నారు. 
 
ఈ విషయాన్ని సోమవారం టీ ఏసీబీ అధికారుల విచారణకు వెళ్లేముందు తన సన్నిహితులతో సండ్ర చెప్పిన మాటలు. పైగా.. ‘నాపై అధికార పార్టీ కన్నుంది. అంత తేలిగ్గా విడిచిపెట్టరని నాకు తెలుసు. జైల్లో ఉండటానికి దుస్తులు కూడా సర్దుకొని వెళ్తున్నాను’ అని ఆయన వారితో వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, ‘రేవంత్‌ రెడ్డి అరెస్టు అయిన మూడు రోజులకు నా వద్దకు అధికార పార్టీకి చెందిన మధ్యవర్తులు వచ్చారు. ఈ కేసులో నాపై కేసు పెట్టే అవకాశముందన్నారు. టీఆర్‌ఎస్‌లో చేరితే కేసులు, అరెస్టులు ఉండవని చెప్పారు. మూడు రోజుల్లో ఏదో ఒకటి తేల్చుకోవాలని... హెచ్చరించారు. 
 
'నేను ఇలాంటి వాటికి భయపడే వాడినికానని, అన్నింటికి సిద్ధపడే ఉన్నానని వారికి తెగేసి చెప్పి పంపించివేశాను’ అని ఇటీవల జరిగిన ఓ మీడియా సమావేశంలోనూ వీరయ్య వ్యాఖ్యానించారు. అంటే తనను అరెస్టు చేయడం తథ్యమని సండ్ర ముందుగానే అంచనాకు వచ్చారని టీడీపీ నేతలు ఇపుడు వ్యాఖ్యానిస్తున్నారు.