సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 ఫిబ్రవరి 2021 (08:00 IST)

సాగర్‌లోనూ దుబ్బాక తీర్పు పునరావృతం : బండి సంజయ్ జోస్యం

తెలంగాణ రాష్ట్రంలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరుగనుంది. ఈ ఎన్నికల్లో కూడా దుబ్బాక అసెంబ్లీ బైపోల్‌లో వచ్చిన తీర్పే రిపీట్ కానుందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ జోస్యం చెప్పారు. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తెరాస అభ్యర్థిపై విజయభేరీ మోగించిన విషయం తెల్సిందే.
 
దీంతో నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై తెలంగాణ బీజేపీ నేతలు దృష్టిసారించారు. ఇక్కడ కూడా గెలిచితీరాలన్న పట్టుదలతో ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా, బండి సంజయ్ మాట్లాడుతూ, చెప్పింది చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లే అడగబోనంటూ సీఎం కేసీఆర్‌ మరోసారి పచ్చి అబద్ధాలు మాట్లాడారని అన్నారు. 
 
ఇప్పటికే ఎన్నో సార్లు ఈ మాట చెప్పి.. కేసీఆర్‌ మోసం చేశారని దుయ్యబట్టారు. మిషన్‌ భగీరథ ద్వారా మంచినీళ్లు ఇవ్వకపోతే 2018 ఎన్నికల్లో ఓట్లే అడగనన్న వ్యక్తి... రాష్ట్రంలో సగం గ్రామాలకు కూడా నీళ్లు ఇవ్వకుండా ఏమొహం పెట్టుకుని ఓట్లడిగారని ప్రశ్నించారు. 
 
నాగార్జునసాగర్‌ భూనిర్వాసితులైన గిరిజనుల భూముల్ని టీఆర్‌ఎస్‌ నేతలు కబ్జా చేస్తుంటే.. సీఎం ఎందుకు మాట్లాడరని నిలదీశారు. పోడు సమస్య, గిరిజనుల రిజర్వేషన్‌పై ప్రశ్నిస్తే కుక్కలని సంబోధిస్తావా? అని మండిపడ్డారు. 
 
గుర్రంబోడు తండాలో గిరిజనుల భూములను టీఆర్‌ఎస్‌ నేత ఆక్రమించుకుంటే.. అడగడానికి వెళ్లిన వారిపై ప్రైవేటు గుండాలతో దాడి చేయించారని, 40 మందిని రెండు నెలల పాటు జైలులో పెట్టారని ధ్వజమెత్తారు. సీఎం చెప్పిక కల్లబొల్లి మాటలను నమ్మడానికి సాగర్‌ ప్రజలు సిద్ధంగా లేరని, దుబ్బాక తీర్పే ఇక్కడా రానుందని జోస్యం చెప్పారు.