శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 డిశెంబరు 2020 (20:51 IST)

ఉద్యోగులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు .. రిటైర్మెంట్ వయసు పొడగింపు!

ప్రభుత్వ ఉద్యోగులపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల వర్షం కురిపించారు. కొత్త సంవత్సరకానుకగా ఉద్యోగులకు వేతనాలు పెంచాలని, ఉద్యోగ విరమణ వయసు పెంచాలని, కోరుకున్న వారికి బదిలీలు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. 
 
అన్నిటి కంటే ముఖ్యంగా సరళతరమైన సర్వీసు నిబంధనల రూపకల్పన, రిటైర్ అయ్యే రోజునే ఉద్యోగులకు అన్ని రకాల ప్రయోజనాలను అందించి ఘనంగా వీడ్కోలు పలకడం, కారుణ్య నియామకాలను చేపట్టడం వంటి అంశాలన్నింటినీ ఫిబ్రవరిలోగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 
 
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉద్యోగులకు 42 శాతం ఫిట్మెంట్‌తో వేతనాలను పెంచామని కేసీఆర్ గుర్తుచేశారు. ఇప్పుడు మరోసారి వేతనాలను పెంచాల్సిన సమయం వచ్చిందని... ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిమితుల మేర అన్ని రకాల ఉద్యోగులకు ఎంతో  కొంత జీతాలను పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. 
 
ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచుతామని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచామని... ఆ హామీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పదవీ విరమణ వయసును ఎంత వరకు పెంచాలనే విషయాన్ని ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు.
 
ఉద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలను జనవరి, ఫిబ్రవరి కల్లా పరిష్కరించాలని.... మార్చి నుంచి ఉద్యోగులందరూ అన్ని సమస్యల నుంచి విముక్తి కావాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఏపీతో నెలకొన్న వివాదాల వల్ల రెవెన్యూ, పోలీసు శాఖల్లో ప్రమోషన్లు ఇవ్వడం సాధ్యం కాలేదని... ఇప్పుడు ఆ వివాదాలన్నీ పరిష్కారమయ్యాయని, కాబట్టి వారికి కూడా పదోన్నతులు ఇవ్వాలని అన్నారు.
 
కాగా, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలతో పాటు.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార తెరాస చిత్తుగా ఓడిపోయింది. ముఖ్యంగా, దుబ్బాకలో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఇక్కడి బీజేపీ విజయభేరీ మోగించింది. అలాగే, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గుడ్డిలో మెల్లగా గట్టెక్కింది. ఈ రెండు చోట్ల అధికార తెరాసకు బీజేపీ ముచ్చెమటలు పోయించింది. దీంతో ప్రజలను, ప్రభుత్వ ఉద్యోగులను ఆకర్షించేందుకు వీలుగా ఈ వరాల జల్లు కురిపిస్తున్నట్టు తెలుస్తోంది.