గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2021 (08:52 IST)

నాకేం దుక్కలా వున్నా... మార్పుపై మాట్లాడితే కర్రు కాల్చి వాతపెడతా.. సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కోపం వచ్చింది. తెరాస కార్యవర్గ సమావేశంలో పార్టీ నేతలకు ఆయన తలంటారు. ముఖ్యమంత్రి మార్పుపై గత కొన్ని రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. కేటీఆర్‌ కాబోయే సీఎం అంటూ ఇటీవల టీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ఎవరైనా దీనిపై మాట్లాడితే కర్రు కాల్చి వాత పెడతానని హెచ్చరించారు. 'సీఎం మార్పు ఉంటుందని మీకు ఎవరు చెప్పారు? దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?' అని సూటిగా ప్రశ్నించారు. మరో పదేళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానన్నారు. 
 
ముఖ్యమంత్రి మార్పుపై జరుగుతున్న ప్రచారంపైనే ఆయన తొలుత మాట్లాడినట్టు సమాచారం. ముఖ్యంగా, 'నాకేమైంది? మంచిగనే ఉన్నా కదా! ఆరోగ్యపరంగా బాగానే ఉన్నా.. దుక్కలా ఉన్నానని ఇదివరకే అసెంబ్లీ వేదికగా చెప్పాను కదా! అయినా మీకు క్లారిటీ రాకపోతే ఎట్లా? నేను నచ్చలేదా మీకు? ముఖ్యమంత్రి పదవికి నేను పనికిరానా? నేను మంచిగా పనిచేయడం లేదా? నన్ను సీఎంగా వద్దని అనుకుంటున్నారా చెప్పండి? 
 
ముఖ్యమంత్రి పదవికి నేను రాజీనామా చేయాలని కోరుకుంటున్నారా? ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు.. అనవసరంగా ప్రజలను, పార్టీ శ్రేణులను ఎందుకు కన్‌ప్యూజ్‌ చేస్తున్నారు?' అని కేసీఆర్‌ ప్రశ్నించారు. పరిష్కరించాల్సిన ప్రజా సమస్యలు చాలా ఉన్నాయని, హామీలను నెరవేర్చాల్సి ఉందని, పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాల్సి ఉందని అన్నారు. కరోనా మహమ్మారి వల్ల పార్టీ కార్యకర్తలతో గ్యాప్‌ వచ్చిందని, తక్షణమే దానిని పూడ్చుకోవాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. 
 
అలాగే, తెరాస పార్టీకి ఒక విధానం, నిర్మాణం ఉన్నాయి. ఒకవేళ మార్పులు, చేర్పులు చేయాలని అనుకుంటే, నేను కేంద్రానికి వెళ్లాలి, నా అవసరం అక్కడ ఉందని అనుకుంటే, మీ అందరినీ పిలుస్తా.. మాట్లాడుతా. అందరి అభిప్రాయాలతోనే ఏకగ్రీవంగా మార్పు చేస్తా. అనవసర రాద్ధాంతం, అక్కరలేని విషయాలు ఎందుకు? ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే పదవులు ఊడుతాయ్' అని హెచ్చరించారు.