శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 7 ఫిబ్రవరి 2021 (11:39 IST)

తెలంగాణాలో 150 - దేశంలో 12059 కరోనా పాజిటివ్ కేసులు

తెలంగాణా రాష్ట్రంలో నమోదవుతున్న పాజిటివ్ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా లెక్కల ప్రకారం కేవలం 150 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,581కి చేరింది. 
 
ఇందులో 2,92,032 మంది కరోనా నుంచి కోలుకున్నారని, మరో 1610 మంది మరణించగా, 1939 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, శనివారంరాత్రి 8 గంటల వరకు 186 మంది కరోనా బారినుంచి బయటపడ్డారని, మరో ఇద్దరు బాధితులు మరణించారని తెలిపింది. 
 
మొత్తం యాక్టివ్‌ కేసుల్లో 808 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 97.2 శాతంగా ఉండగా, మరణాల రేటు 0.54 శాంగా ఉన్నదని తెలిపింది. కొత్తగా నమోదైన పాజిటివ్‌ కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 25 కేసులు ఉన్నాయి.
 
కాగా, రాష్ట్రంలో రెండో విడుత కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ శనివారం ప్రారంభమయ్యింది. శనివారం 15,437 మంది కరోనా టీకా తీసుకున్నారని తెలిపింది. ఇక శనివారం వరకు మొత్తం 2,08,922 మంది కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నారని వెల్లడించింది.  
 
ఇదిలావుంటే, దేశంలో కొత్తగా 12,059 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,08,26,363కు చేరింది. కొత్తగా 11,805 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 1,05,22,601 మంది కోలుకున్నారు. 
 
వైరస్‌ బారినపడి తాజాగా 78 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 1,54,996కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 1,48,766 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని మంత్రిత్వశాఖ వివరించింది. ఇదిలావుండగా శనివారం దేశవ్యాప్తంగా 6,95,789 కొవిడ్‌ టెస్టులు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ తెలిపింది. ఇప్పటివరకు 20,13,68,378 టెస్టులు చేసినట్లు వివరించింది.