శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2021 (12:31 IST)

కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారా? కేసీఆర్ ఆదివారం ఎలాంటి ప్రకటన చేస్తారో?

kcrao
తెలంగాణ మంత్రి కేటీఆర్.. తన తండ్రి, తెలంగాణ సీఎం కేసీఆర్ స్థానంలో ముఖ్యమంత్రి కాబోతున్నారనే వార్తలపై స్పష్టత రానుంది. కేటీఆర్ తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరించారనే పుకార్ల మధ్య ఆదివారం కేసీఆర్ కీలక నేతలతో భేటీ కాబోతున్నారు. ఈ భేటీ సందర్భంగా కేసీఆర్ ఎలాంటి ప్రకటన చేస్తారని గులాబీ వర్గాలు ఆత్రుతతో ఎదురుచూస్తున్నాయి. 
 
ఈ నెల 7న(ఆదివారం) మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల‌ చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జర‌గ‌నుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కమిటీ సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులు, లోకసభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్ పర్సన్లు, మున్సిపల్ మేయర్లు, డీసీసీబీ అధ్యక్షులు, డీసీఎంఎస్ అధ్యక్షులను ఆహ్వానించారు.
 
పార్టీ సభ్యత్వాల పునరుద్ధరణ, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల నియామకం, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి ఎన్నిక, ఏప్రిల్ 27న పార్టీ వార్షిక మహాసభ, ఇతర సంస్థాగత అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించ‌నున్నారు.
 
గులాబీ పార్టీని బలోపేతం చేసే దిశగా ఈ సమావేశంలో గులాబీ అధినేత లీడర్లకు ఏం చెప్పబోతున్నారు? ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారు ? తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు గత కొంతకాలంగా ఎదురుగాలి వీస్తోంది. దుబ్బాకలో ఓటమి, గ్రేటర్‌లో అనుకున్నంత ఫలితాలు సాధించలేకపోవడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్‌.
 
పార్టీ నేతలు కూడా నైరాశ్యంతో ఉండటంతో.. వారిలో జోష్ నింపేందుకు కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏప్రిల్ నెలలో జరిగే గులాబీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ నిర్మాణం చేస్తూ.. క్యాడర్‌ను బలపరిచేందుకు సిద్ధమయ్యారు. 
 
గతేడాది కోవిడ్ వల్ల పార్టీ వ్యవస్థాపక దినోత్సవం జరగలేదు. ఈసారి దాన్ని ఘనంగా చేయాలని డిసైడ్ అయ్యారు కేసీఆర్‌. ఆదివారం మధ్యాహ్నం పార్టీ నేతలతో దానిపై చర్చించనున్నారు. అంతేగాకుండా తన స్థానంలో కేటీఆర్‌ను ప్రకటిస్తారా అనే దానిపై కూడా చర్చ సాగుతోంది.