శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : మంగళవారం, 15 ఆగస్టు 2017 (17:08 IST)

డ్రగ్స్ స్కామ్‌లో చిక్కుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టను : సీఎం కేసీఆర్

హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ స్కామ్‌లో చిక్కుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా ఆయన గోల్కొండ

హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ స్కామ్‌లో చిక్కుకున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాల్లో భాగంగా ఆయన గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న ఏ ఒక్క ప్రముఖుడినీ వదిలేది లేదని హెచ్చరించారు.
 
ముక్కుపచ్చలారని విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న ఈ మహమ్మారిని కూకటివేళ్లతో సహా పెకిలిస్తానని స్పష్టం చేశారు. సినీ ప్రముఖులైనా, రాజకీయ నాయకులైనా, వ్యాపారులైనా మత్తుమందుల వాడకంలో నేరం నిరూపితమైతే చట్టం ముందు ఒకటేనని తెలిపారు.
 
కోటి ఎకరాలకు నీరివ్వడమే తన కలని, దాన్ని సాకారం చేసేందుకు అందరు ప్రభుత్వ అధికారులూ కలసి రావాలని కోరారు. ఇటీవలే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పునర్ వైభవాన్ని కల్పించేందుకు పనులు ప్రారంభించామని గుర్తు చేసిన కేసీఆర్, వచ్చే సంవత్సరం నుంచి రైతుల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించనున్నామని అన్నారు. ఎకరానికి రూ. 8 వేల చొప్పున రైతుకు అందిస్తామని తెలిపారు. 
 
అలాగే, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 48,070 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ వెలువరించనున్నామని ఆయన తెలిపారు. ఇప్పటివరకూ తమ ప్రభుత్వం 27,660 ఉద్యోగాలను భర్తీ చేసిందని గుర్తు చేసిన ఆయన, 36,806 ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. 
 
మొత్తం 1,12,536 కొత్త ఉద్యోగాలను తమ ప్రభుత్వం కల్పిస్తోందని గుర్తు చేసిన కేసీఆర్, కొత్తగా పోలీసు శాఖలో 27,440, ఉపాధ్యాయ వృత్తిలో 12,005, గురుకులాల్లో 12,436, ఆరోగ్య శాఖలో 8,347, సింగరేణిలో 1,970, రెవెన్యూ శాఖలో 2,506, వ్యవసాయ శాఖలో 1,418, అటవీ శాఖలో 2,033, ఎంఏయూడీలో 1,850, ఉన్నత విద్యాశాఖలో 1,673, నీటి పారుదల శాఖలో 1,053, ఆర్థిక శాఖలో 703, స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 587, పంచాయితీ రాజ్ శాఖలో 3,528 పోస్టులను భర్తీ చేయనున్నామని వెల్లడించారు.