గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 మే 2021 (16:15 IST)

తెలంగాణాలో 18 యేళ్లు పైబడిన వారికి అనుమతి... ప్రైవేట్ ఆస్పత్రులకూ అనుమతి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 18 యేళ్ళు పైబడిన వారికి కూడా టీకాలు ఇచ్చేందుకు అనుమతి ఇచ్చింది. నిజానికి మంగళవారం నుంచి రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ అందిస్తోంది. అయితే, 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ అందించాలని తాజాగా రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 
 
అనుమతి ఉన్న ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ, కార్యాలయాలు, కంపెనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లోనూ 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా వ్యాక్సినేషన్ అమలు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా వ్యాక్సినేషన్ మార్గదర్శకాలు పాటిస్తూ ముందస్తుగా కొవిన్ పోర్టల్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.
 
వ్యాక్సినేషన్‌కు ప్రైవేట్‌ దవాఖానలతో అనుసంధానం కావాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జీ శ్రీనివాసరావు సూచించారు. 18 ఏండ్లు నిండిన వారు టీకా కోసం కొవిన్‌ పోర్టల్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. కొవిడ్ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రించి సంస్థలు, కంపెనీలు, గేటెడ్ కంపెనీల అభ్యర్థన మేరకు ప్రైవేటు ఆస్ప‌త్రులు టీకా డ్రైవ్‌లు నిర్వహించవ‌చ్చ‌న్నారు. 
 
కాగా, దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా, 18 నుంచి 44 ఏళ్ల లోపు వారికి కూడా వ్యాక్సిన్ ఇవ్వొచ్చని కేంద్రం ప్రకటించింది. అయితే టీకాల కొరతతో చాలా రాష్ట్రాలు 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇంకా 45 ఏళ్లకు పైబడినవారికి రెండో డోస్ ఇచ్చే కార్యక్రమాలే కొనసాగుతున్నాయి.