శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 జనవరి 2023 (12:20 IST)

వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు వంద సీట్లు ఖాయం : మంత్రి ఎర్రబెల్లి

errabelli dayakar rao
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఈ యేడాది ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీకి వంద సీట్లు ఖాయమని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జోస్యం చెప్పారు. అయితే, ప్రజామద్దతు కోల్పోయిన 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేల స్థానంలో కొత్తవారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో జరిగిన బీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
 
బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని, అయితే పార్టీ విజయానికి ప్రస్తుత ఎమ్మెల్యేల జాబితాలో మార్పులు అవసరమని సీఎం కేసీఆర్ విశ్వసిస్తున్నారని ఎర్రబెల్లి చెప్పారు. గతంలో తాను నిర్వహించిన సర్వేలు కూడా ఎన్నడూ విఫలం కాలేదని మంత్రి దయాకర్ రావు తెలిపారు.
 
ఈ యేడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మరోసారి బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలు, బీజేపీ అధిష్టానం రాష్ట్రంపై దృష్టి సారించడంతో తెలంగాణలో కూడా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్లాన్ చేస్తున్నాయి.