మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 9 జనవరి 2023 (16:50 IST)

చంద్రబాబు - పవన్ కళ్యాణ్ కలుసుకోకుండా జీవో నెంబర్ 2 : టీడీపీ నేతల వ్యంగ్యాస్త్రాలు

pawan - babu
హైదరాబాద్ నగరంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లు ఆదివారం సమావేశమయ్యారు. భాగ్యనగరిలోని చంద్రబాబు నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశం వైకాపా నేతల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ భేటీపై ఏకంగా ఏడుగురు మంత్రులు ఎదురుదాడికి దిగారు. అదేసమయంలో టీడీపీ నేతలు కూడా తమదైనశైలిలో తిప్పికొట్టారు. వైకాపా నేతలపై వ్యంగ్యస్త్రాలు కూడా సంధించారు. 
 
తాజాగా టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ స్పందిస్తూ, తమ శాఖల పురోగతిపై ఏనాడూ స్పందించని మంత్రులు ఈ భేటీపై మాత్రం అతిగా స్పందించారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కాఫీ తాగేందుకు కలిస్తే 12 మంది మంత్రులు స్పందించారు. ఇక ఇద్దరు కలిసి భోజనం చేస్తే ఈ మంత్రులు ఏమైపోతారో అంటూ వ్యాఖ్యానించారు. మున్ముందు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవకుండా జీవో నెంబరు 2 తీసుకువస్తారేమో అంటూ అనగాని సత్యప్రసాద్ వ్యంగ్యం ప్రదర్శించారు. 
 
కాగా, హైదరాబాద్‌లో జరిగిన భేటీ కోసం చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లారు. వారిద్దరూ దాదాపు రెండున్నర గంటల పాటు భేటీ అయ్యారు. ఇటీవల విపక్ష నేతల ర్యాలీలు, రోడ్‌షోలు నిర్వహించకుండా వైకాపా ప్రభుత్వం జీవో నంబరు 1ని తీసుకొచ్చింది. దీంతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. ఇది వైకాపా మంత్రులు, నేతలు జీర్ణించుకోలేక, తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.