రాజగోపాల్ అన్నా తొందరపడకు.. మాటజారకు...: ఎమ్మెల్సీ కవిత కౌంటర్
బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కె.కవిత ఒక విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ సమర్చించిన చార్జిషీటులో కవిత పేరు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో బీజేపీ నేతలు ఆమెను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ చార్జిషీటులో "లిక్కర్ క్వీన్ పేరు 28 సార్లు ఉంది'' అని రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్‌కు ఆమె గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. "రాజగోపాల్ అన్నా... తొందరపడకు.. మాట జారకు.. 28 సార్లు నా చెప్పించినా.. 28 వేల సార్లు నా పేరు చెప్పించినా అబద్ధం నిజం కాదు.." అని కవిత రీట్వీట్ చేశారు.
మరోవైరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ కూడా ట్వీట్ చేశారు. మున్ముందు కవిత ఇవ్వాల్సిన వివరణలు చాలానే ఉన్నాయని పేర్కొన్నారు. వీటిపై కూడా కవిత స్పందించారు. నాపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా బూటకమైనవి. అబద్ధం. నా చిత్తశుద్ధిని కాలమే రుజువు చేస్తుంది. బీజేపీ రైతు వ్యతిరేక, పెట్టుబడిదారీ అనుకూల విధానాలను బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బహిర్గతం చేస్తారనే భయంతో బీజేపీ రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతుందని ఆమె ఆరోపించారు.