సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 11 డిశెంబరు 2022 (13:10 IST)

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : ఎమ్మెల్సీ కవిత వద్ద సీబీఐ విచారణ ప్రారంభం

cbi -kavitha
ఢిల్లీ మద్యం స్కామ్‌లో భారత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కె.కవిత పాత్ర ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆమె వద్ద సీబీఐ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇందుకోసం సీబీఐ అధికారుల బృందం ఆదివారం ఉదయం హైదరాబాద్ నగరంలోని కవిత నివాసానికి చేరుకున్నారు. 
 
కాగా, ఈ కేసులో కవిత వద్ద విచారణకోసం ఆరో తేదీని సూచిస్తూ సీబీఐ ఓ లేఖను రాసింది. ఆ రోజున తనకు ఇతర కార్యక్రమాలు ఉన్నందున 11, 12, 14, 15 తేదీల్లో తాను అందుబాటులో ఉంటానని తెలుపుతూ ప్రత్యుత్తరం రాశారు. దీంతో సీబీఐ అధికారులు ఆదివారం విచారిస్తామని సమాచారం ఇవ్వగా, అందుకు కవిత అంగీకరించారు. ఈ క్రమంలో సీబీఐ అధికారుల బృందం ఆదివారం ఆమె నివాసానికి చేరుకున్నారు. 
 
మరోవైపు, ఢిల్లీ లిక్కర్ స్కాములో తన పేరు ఉన్నట్టు ఆరోపణలు వచ్చిన దరిమిలా ఆమె న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నట్టు సమాచారం. పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ తన ఇంటి వద్దకు రావొద్దని కోరారు. సీబీఐ విచారణ నేపథ్యంలో కవిత ఇంటికి వెళ్లే మార్గంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు.